అదానీ ఇష్యూపై జేపీసీ వెయ్యాలె : రాహుల్

అదానీ ఇష్యూపై జేపీసీ వెయ్యాలె : రాహుల్

ముంబై : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వెయ్యాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. ముంబైలో గురువారం ప్రతిపక్షాల కూటమి మీటింగ్ కు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ పై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) సంస్థ విడుదల చేసిన తాజా రిపోర్టులో ఆరోపణలు చేసిన నేపథ్యంలో రాహుల్ ఈ విషయంపై మరోసారి స్పందించారు. జీ20 మీటింగ్ కు ముందు దేశం ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు ప్రధాని మోదీ జేపీసీ వేసి తన నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. ఇది జాతీయ అంశమన్నారు. ప్రతిపక్షాల కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, తామంతా కలిసే ఉన్నామన్నారు. 

ఆ 20 వేల కోట్లు ఎవరివి?: జైరామ్  

అదానీ గ్రూప్​తో లింక్ అయిన షెల్ కంపెనీల్లో అవినీతి జరుగుతున్నదని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరామ్ రమేశ్ విమర్శించారు. షెల్ కంపెనీల్లోని రూ.20 వేల కోట్లు ఎవరివో ప్రధాని మోదీ చెప్పాలన్నారు. జనవరి 28 నుంచి మార్చి 28 దాకా అదానీ గ్రూప్ విషయంలో మోదీకి ఎన్నో ప్రశ్నలు వేశామని, ఒక్కటికి కూడా జవాబు చెప్పలేదన్నారు. జేపీసీ వేసి విచారణ జరిపితేనే అసలు విషయాలు బయటికి వస్తాయని డిమాండ్ చేశారు. మోదీ, అదానీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.