
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ గతంలో నివసించిన ఇంటికే తిరిగి వెళ్లనున్నారు. ఢిల్లీలోని12– తుగ్లక్ లేన్‌లోని బంగ్లాను రాహుల్‌గాంధీకి కేటాయిస్తూ లోక్ సభ హౌసింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇటీవల పరువు నష్టం కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. దాంతో ఆయన ఎంపీ సభ్యత్వంపై వేటు పడింది. ఆపై అధికారిక బంగ్లాను ఆయన ఖాళీ చేసి తన తల్లి సోనియా గాంధీ ఇంటికి వెళ్లారు. సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్‌పై అనర్హత వేటును ఎత్తేయడంతో మళ్లీ అదే బంగ్లాను కేటాయించారు. అధికారక బంగ్లాను కేటాయించడంపై రాహుల్ స్పందిస్తూ.. దేశమంతా తన ఇల్లేనని పేర్కొన్నారు.
ఈ నెల 12న వయనాడ్‌కు..
ఈ నెల 12, 13 తేదీల్లో రాహుల్ గాంధీ తన నియోజకవర్గం వయనాడ్‌లో పర్యటించనున్నారు. పార్లమెంటు సభ్యుడిగా తిరిగి బాధ్యతలు స్వీకరించాక.. తొలిసారి తన నియోజకవర్గ ప్రజలను కలుసుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ వెల్లడించారు. “ఆగస్టు 12,-13 తేదీల్లో రాహుల్ గాంధీ వయనాడ్‌లో పర్యటిస్తారు. ఎంపీగా ఆయన తిరిగి బాధ్యతలు స్వీకరించడంపై వయనాడ్ ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ కేవలం ఎంపీ మాత్రమే కాదు.. వయనాడ్ ప్రజల కుటుంబ సభ్యుడు కూడా" అని కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.