ప్లీజ్ వెయిట్.. ఐ విల్ కాల్ యూ.. డీకే శివకుమార్కు రాహుల్ గాంధీ మెసేజ్

ప్లీజ్ వెయిట్.. ఐ విల్ కాల్ యూ.. డీకే శివకుమార్కు రాహుల్ గాంధీ మెసేజ్
  • నేను, సోనియా, రాహుల్ సమస్యను పరిష్కరిస్తం: ఖర్గే 

బెంగళూరు: కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కమార్ ల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో డీకేకు రాహుల్ గాంధీ పెట్టిన మెసేజ్ హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ విదేశాల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వచ్చాయి. 

వీటిపై రాహుల్ తో చర్చించేందుకు డీకే పలుమార్లు ప్రయత్నించినట్టు తెలిసింది. ఆ సమయంలో రాహుల్ ‘‘ప్లీజ్ వెయిట్.. ఐ విల్ కాల్ యూ” అని మెసేజ్ పంపారు. ఇదిలా ఉండగా మంగళవారం అర్ధరాత్రి పీడబ్ల్యూడీ మినిస్టర్ సతీష్ జార్కిహోళితో డీకే సమావేశం అయినట్టు తెలుస్తోంది. విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ మీటింగ్ జరిగినట్టు సమాచారం అందుతుంది.

డిసెంబర్ 1నాటికి సంక్షోభానికి హైకమాండ్ చెక్ 

కర్నాటకలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షోభాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం మీడియాతో ఖర్గే మాట్లాడారు. 

“నేను, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం’’ అని చెప్పారు. డిసెంబర్ 1న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఈ సంక్షోభానికి కాంగ్రెస్ హైకమాండ్ చెక్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.