బీజేపీని ఈజీగా ఓడిస్తం : రాహుల్ గాంధీ​

బీజేపీని ఈజీగా ఓడిస్తం :  రాహుల్ గాంధీ​
  • మా బలం చూసి, బీజేపీకి భయం పట్టుకుంది: ఖర్గే

ముంబై: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఈజీగా ఓడిస్తామని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం ముంబైలో మీటింగ్ ముగిసిన తర్వాత ‘ఇండియా’ కూటమి నేతలు జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘మీరు ఒక్క విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఇండియా కూటమి దేశంలోని 60 శాతం మంది ప్రజలను రిప్రజెంట్ చేస్తోంది. ఒకవేళ లోక్ సభ ఎన్నికల్లో మేమంతా కలిసి పోటీ చేస్తే, బీజేపీ గెలవడం అసాధ్యం. 

మా కూటమి బీజేపీని ఈజీగా ఓడిస్తుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమిలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, అవి చాలావరకు తొలగిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. తమ కూటమి బలాన్ని చూసి బీజేపీకి భయం పట్టుకుందని అన్నారు. ‘‘బీజేపీ మొదటి నుంచీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోంది. ఇప్పుడు మనల్ని దెబ్బతీసేందుకు దర్యాప్తు సంస్థలతో మళ్లీ రెయిడ్స్ చేయిస్తుంది. మీరందరూ దానికి సిద్ధంగా ఉండండి” అని కూటమి నేతలకు సూచించారు. 

ఇక బీజేపీ ఇంటికే: నితీశ్ 

బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, దానికి సిద్ధంగా ఉండాలని కూటమి నేతలకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ సూచించారు. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయని, ఇక అధికార పార్టీ ఇంటికి వెళ్లాల్సిందేనని అన్నారు. తాము రోజురోజుకు బలపడుతున్నామని శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే అన్నారు. ‘ఇండియా’ అలయెన్స్ కేవలం కొన్ని పార్టీల కూటమి కాదని, దేశాభివృద్ధి కోరుకుంటున్న 140 కోట్ల మంది ప్రతినిధి అని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు.