పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది మోడీ కాదు రాష్ట్రపతి: రాహుల్ గాంధీ

పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది మోడీ కాదు రాష్ట్రపతి: రాహుల్ గాంధీ

మే 28న ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని విపక్ష నేతలు  అభ్యంతరం వ్యక్తం  చేస్తున్నారు.  వీర్ సావర్కర్ జయంతి రోజున కొత్త పార్లమెంటును  ప్రారంభించడమేంటని  కాంగ్రెస్ సీనియర్ నేత జై రాంరమేశ్ ఇటీవలే ట్వీట్   చేసిన సంగతి తెలిసిందే.  ప్రధాని మోడీ  ప్రభుత్వాధినేత.. శాసనసభకు అధిపతి కాదని..  మోడీ పార్లమెంటును ఎందుకు ప్రారంభించాలని  ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా ప్రశ్నించారు.  లేటెస్ట్ గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు.  పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది  ప్రధాని మోడీ కాదు.. రాష్ట్రపతి అంటూ ట్వీట్ చేశారు.

మే 28న ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని.. లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోడీని కలిసి కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారు.  కొత్త పార్లమెంట్ భవనం భారతదేశ స్ఫూర్తికి ప్రతీక అని లోక్‌సభ సెక్రటేరియట్  ఆకాంక్షించారు.

కొత్త పార్లమెంట్ భవనంలో లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది, రాజ్యసభలో 300 మంది సభ్యులు కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుందని లోక్‌సభ సెక్రటేరియట్ పేర్కొంది. ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగితే లోక్‌సభ ఛాంబర్‌లో మొత్తం 1,280 మంది సభ్యులకు కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుత పార్లమెంట్ భవనంలో 543 మంది సభ్యులు, రాజ్యసభ భవనంలో 250 మంది సభ్యులు కూర్చునే అవకాశం ఉంది. 

ప్రస్తుత పార్లమెంట్ భవనం 1927లో పూర్తయి దాదాపు 100 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఏళ్ల తరబడి ఉన్న పాత భవనం నేటి అవసరాలకు సరిపోదని  పార్లమెంట్‌కు కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూ లోక్‌సభ, రాజ్యసభలు తీర్మానాలు చేశాయి. 2020 డిసెంబర్ 10న కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.