- మోదీని దూషించారని యువతిపై కేసు పెట్టడంపై ఆగ్రహం
- భావితరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన
- పరువునష్టం దావా వేయాలి తప్ప క్రిమినల్ కేసులేంటన్న సీజేపీ
- ఆందోళనకారులపై కేసులు పెట్టడాన్ని ఖండించిన సౌరవ్ దాస్
న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం జెన్‌జీని అణచివేయాలని ప్రయత్నిస్తోందని, కేసులు, ఎఫ్ఐఆర్ ల పేరుతో బెదిరింపులకు గురిచేస్తోందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలంటూ ఆందోళన చేసిన యువతరాన్ని మోదీ సర్కారు ఇప్పుడు బెదిరింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆందోళనల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని దూషించిందంటూ పాతికేళ్ల యువతిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై రాహుల్ గాంధీ ఎక్స్ లో స్పందించారు.
‘‘ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా.. బెదిరింపులతో మీరు జెన్ జీ గొంతు నొక్కలేరు. ఆందోళనల సమయంలో లాఠీచార్జ్ చేసి యువత ఎముకలు విరిచేశారు. ఇప్పుడేమో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ, వారి సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయిస్తున్నారు. మీరు గతం.. యువతే దేశ భవిష్యత్తు. వారితో వ్యవహరించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి” అంటూ రాహుల్ గాంధీ హెచ్చరించారు.
విద్యార్థినిపై జీరో ఎఫ్ఐఆర్..
సీజేపీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనల్లో వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్న విషయం తెలిసిందే.
ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలవంతం కావడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సీజేపీ ఆందోళన విరమించింది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను కేసుల పేరుతో వేధించే ప్రయత్నం చేయొద్దని, ఇప్పటికే నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని సీజేపీ డిమాండ్ చేసింది. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. అయితే, తాజాగా పలువురు నిరసనకారులపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నట్లు సీజేపీ ఆరోపించింది.
జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్న రుచికా సింగ్(25)పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపింది. నిరసనల సమయంలో ప్రధాని మోదీని రుచికా సింగ్ దూషించారని, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని కేసు పెట్టారని ఆరోపించింది. నోయిడాలోని ఎక్స్ ప్రెస్ వే పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దానిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారని సీజేపీ నేతలు తెలిపారు.
అధికార దుర్వినియోగం వద్దు: సీజేపీ
రుచికా సింగ్ పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందించారు. రుచిక చేసిన వ్యాఖ్యలు తప్పు కావచ్చు కానీ ఇలా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదని అన్నారు. నిరసనల్లో భాష సరికాకపోతే పరువునష్టం దావాలు వేసుకోవాలి తప్ప, క్రిమినల్ కేసులు పెట్టడం భావప్రకటన స్వేచ్ఛను అణచివేయడమేనని మండిపడ్డారు. నిరసనకారులపై ఇలా నేరపూరిత కేసులు నమోదు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎవరినైనా సరే దండించడం సరికాదని అన్నారు.
అదేసమయంలో రుచిక ఉపయోగించిన భాషను తాను సమర్థించడంలేదంటూ సౌరవ్ క్లారిటీ ఇచ్చారు. అలాగే, నిరసనల్లో ఉపయోగించే భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అభ్యంతరకరమైన పదాలు, వ్యాక్యాలు ఉపయోగించ వద్దని యువతకు సూచించారు. ఈ విషయంలో పోలీసులు శాంతియుతంగా ఉండాలని కోరారు.
రాజకీయ ప్రయోజనాల కోసం వారి అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని సౌరవ్ విజ్ఞప్తి చేశారు. ‘అనుచిత వ్యాఖ్యలు చేశారని క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదు. దేశంలో సగం మంది లోక్‌సభ ఎంపీలపై, ఒక్క బీజేపీలోనే 100 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. పోలీసులు తమ శక్తిని, దృష్టిని వారిపై పెట్టాలి కానీ 25 ఏళ్ల యువతిపై కాదు’ అని సౌరవ్ దాస్ హితవు పలికారు.
