- పరీక్షల్లో అవకతవకలపై ప్రశ్నిస్తే సోరోస్ ఏజెంట్లు అని అంటరా: రాహుల్ గాంధీ
- మోదీ సర్కారుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత ఫైర్
- సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం పరీక్షపై కేంద్రాన్ని
- నిలదీసిన వేదాంత్, అతని స్నేహితులతో ముఖాముఖి
- ఆ విద్యార్థులు చాలా ధైర్యవంతులని ప్రశంస.. వారికి న్యాయం జరిగేదాకా పోరాడతామని వెల్లడి
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) మూల్యాంకన విధానంలో చోటుచేసుకున్న అవకతవకల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నది. ఈ వివాదంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాధితులైన విద్యార్థులతో ఆయన ముఖాముఖి మాట్లాడిన ఒక వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకున్నారు. ఇందులో కేంద్ర వైఖరిని ఎండగట్టారు. న్యాయం కావాలని ప్రశ్నించిన 17 ఏండ్ల విద్యార్థులను దేశద్రోహులు, సోరోస్ ఏజెంట్లు అంటూ ముద్ర వేస్తారా? అని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ విద్యార్థులతో జరిపిన సంభాషణ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. వ్యంగ్యంగా ‘నా తోటి దేశద్రోహ సొరోస్ ఏజెంట్లతో ఒక బహిరంగ చర్చ’ అని శీర్షిక పెట్టారు. ‘‘వేదాంత్, అతని స్నేహితులు ఎంతో తెలివైన, ధైర్యవంతులైన భారతీయ యువతీ యువకులు. వారు సీబీఎస్ఈని, మోదీ ప్రభుత్వాన్ని చాలా సాధారణ ప్రశ్నలు అడిగారు. కానీ వారికి సమాధానాలకు బదులు అవమానాలు ఎదురయ్యాయి. ఈ విద్యార్థులకు ఉజ్వలమైన, సురక్షితమైన భవిష్యత్తు ఉండాలి. అది వారికి దక్కేలా మేం పోరాడతాం” అని వ్యాఖ్యానించారు.
జ్యుడీషియల్ విచారణ జరపాలి
జవాబు పత్రాలు అడిగినంత మాత్రాన విద్యార్థులు దేశద్రోహులు అయిపోయారా? అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘ఒక సమస్యను పరిష్కరించాలంటే ముందు ఆ సమస్య ఉందని అంగీకరించాలి. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం లోపాలను ఒప్పుకోకుండా, అమాయక పిల్లలపై నిందలు వేస్తూ వారిని టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తోంది’’ అని అన్నారు. సీబీఎస్ఈ ఓఎస్ఎం కాంట్రాక్ట్ పొందిన ‘కోఎంప్ట్’ సంస్థపై కూడా రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు. గతంలో తెలంగాణలో వివాదాల్లో చిక్కుకున్న ‘గ్లోబరీనా’ సంస్థే పేరు మార్చుకుని ఈ కాంట్రాక్ట్ దక్కించుకుందని విమర్శించారు. ఈ మొత్తం కుంభకోణంపై స్వతంత్ర జ్యుడీషియల్ విచారణ లేదా సిట్ దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే?
ఇటీవల వెల్లడైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల అనంతరం రీ-వాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా వేదాంత్ అనే విద్యార్థి తనకు అందిన ఫిజిక్స్ ఆన్సర్ షీట్ కాపీని సోషల్ మీడియాలో ఉంచాడు. ఆ ఆన్సర్ షీట్‌పై ఉన్న కవర్ పేజీ తనదే అయినప్పటికీ, లోపల ఉన్న పేజీల్లోని రాత తనది కాదని, వేరే ఎవరో రాసిన పేపర్లు తన ఖాతాలో కలిపేశారని ఆరోపించాడు. ఈ పోస్ట్ కాస్తా వైరల్‌గా మారడంతో, దేశవ్యాప్తంగా అనేకమంది విద్యార్థులు తమకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని గళమెత్తారు. దీనిపై వేదాంత్ మాట్లాడుతూ.. ‘‘మేం మాకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే, మమ్మల్ని అణచివేయడానికి కొందరు ఆన్‌లైన్ వేదికగా డీప్ స్టేట్ ఏజెంట్లు అని, దేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు అని ముద్ర వేశారు’’ అని రాహుల్ గాంధీ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు.
