- దక్షిణ మధ్య డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేశ్ వైష్ణవ్
కొమురవెల్లి, వెలుగు : మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ పరిసర ప్రాంతంలో హాల్టింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని దక్షిణ మధ్య డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేశ్ వైష్ణవ్ చెప్పారు. బుధవారం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని ఆయన రైల్వే అధికారులతో కలిసి దర్శంచుకున్నారు. అనంతరం విలేకరుల మాట్లాడుతూ.. మనోహరాబాద్ –కొత్తపల్లి రైల్వేలైన్ మూడు సంవత్సరాల్లో పూర్తి అవుతుందని తెలిపారు.
కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌలతు కోసం తిమ్మరెడ్డిపల్లి కమాన్ నుంచి కొమురవెల్లి దగ్గరలో హాల్డింగ్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలోనే పనులు స్టార్ట్ అవుతాయన్నారు. వచ్చే జనవరిలోగా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు రైలును నడిపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు సీనియర్ డీవోఎం వెంకన్న, డీసీఎం బాలాజీ, సోమరాజు, జనార్దన్, ఆలయ ఏఈవో అంజయ్య, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

