హైదరాబాద్ సిటీ, వెలుగు: మల్ఖేడ్‌లోని సిమెంట్ సైడింగ్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలను పరిశీలించి, సరుకు రవాణా కార్యకలాపాలను సమీక్షించారు. అల్ట్రాటెక్ సైడింగ్‌లోని సెంట్రల్ కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేశారు.
కంట్రోల్ రూమ్‌లో ఉన్న అత్యాధునిక పరికరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం సిమెంట్ సైడింగ్‌లోని ఉత్పత్తి ప్లాంట్‌ను పరిశీలించి, లోడింగ్ మౌలిక సదుపాయాలు, సరుకు రవాణా సౌకర్యాలను అంచనా వేశారు.
ఈ సందర్భంగా ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి తాండూర్ వరకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(జీపీఆర్) అమర్చిన కోచ్‌లో ప్రయాణించి ట్రాక్ తనిఖీని ప్రారంభించారు. జీపీఆర్ వ్యవస్థ, విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించి ట్రాక్ కింద ఉన్న పొరలను ఎటువంటి విధ్వంసం కలిగించకుండా స్కాన్ చేసి ట్రాక్ భద్రతను అంచనా వేయొచ్చన్నారు.
దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాక్ భద్రతను సమర్థవంతంగా పరిశీలించే అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ పద్మజ, సికింద్రాబాద్ డీఆర్‌ఎం డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్తో పాటు ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.
