రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం..నేలకొరిగిన చెట్లు,విద్యుత్ స్తంభాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం..నేలకొరిగిన చెట్లు,విద్యుత్ స్తంభాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా మారిన వాతావరణం... ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన ప్రజలను, ముఖ్యంగా అన్నదాతలను నిలువునా ముంచేసింది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్, గుట్టపల్లి చెరువు తండా, రాజన్నపేట ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ఎల్లారెడ్డిపేట మండలంలో సాయంత్రం  వీచిన ఈదురు గాలులు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. అల్మాస్పూర్ గ్రామంలో ఓ భారీ చెట్టు కారుపై పడటంతో... ఆ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. అటు ఎల్లారెడ్డిపేట–వీర్నపల్లి ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, తీగలపై చెట్లు విరిగిపడటంతో చాలా గ్రామాల్లో అంధకారం అలుముకుంది.

ఈ అకాల వర్షం.. కోట్లాది ఆశలతో ఉన్న రైతు గుండెల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో పూర్తిగా తడిసిపోయింది. ఈదురు గాలుల ధాటికి రైతులు కప్పిన టార్పాలిన్ కవర్లు ఎగిరిపోవడంతో... వడ్ల కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కొన్నిచోట్ల చేతికొచ్చిన వడ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో, కళ్లముందే పంట నష్టపోయిన అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరోవైపు గుంటపల్లి చెరువు తండాలో పిడుగు పడటంతో ఓ పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.

అకాల వర్షం... ఈదురు గాలుల బీభత్సం... రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీరని విషాదాన్ని నింపింది. కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతాంగం కోలుకోలేని దెబ్బతిన్నది. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తమను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి కాపాడాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.