సౌత్ లో వానలు.. నార్త్ లో ఎండలు..హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

సౌత్ లో వానలు.. నార్త్ లో ఎండలు..హైదరాబాద్ లో దంచికొట్టిన వాన
  • పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీళ్లు, ట్రాఫిక్ ​జామ్​
  • దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షం
  • ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 
  • ఇంకా తగ్గని ఉష్ణోగ్రతలు
  • కుమ్రంభీమ్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో 43 డిగ్రీలు
  •  తెలంగాణలో విభిన్న వాతావరణం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భిన్న వాతావారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ మంట ఉండగా.. దక్షిణాది జిల్లాలు కాస్త చల్లబడ్డాయి. శనివారం హైదరాబాద్ సహా పలు దక్షిణాది జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. వికారాబాద్, హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో శనివారం వర్షం పడింది. 

అత్యధికంగా వికారాబాద్ జిల్లాలోని తాండూరులో 5.1 సెంటీమీటర్ల వర్షం పడింది. వనపర్తి జిల్లా ఏదులలో 5.1, రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో వారం రోజులపాటు వర్షాలు పడుతాయని చెప్పిన వాతావరణ శాఖ.. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో టెంపరేచర్లు 40 డిగ్రీలలోపు నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 44 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. 

జగిత్యాల జిల్లా నేరెళ్ల, మంచిర్యాల జిల్లా ర్యాలీలో 43 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. జయశంకర్, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, ఆదిలాబాద్, హనుమకొండ, నల్గొండ, నిర్మల్, భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, నైరుతి రుతుపవనాలు ఏపీలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈ రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేసింది.

హైదరాబాద్ లో మారిన వాతావరణం

హైదరాబాద్ సిటీలో శనివారం సాయంత్రం 4 గంటలకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఆ తరువాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని జోరు వాన కురిసింది. ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు ఒక్కసారిగా చల్లని వాతావరణం ఏర్పడింది.  దాదాపు అరగంటపాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. 

షేక్ పేట, గచ్చిబౌలి, కూకట్ పల్లి, గోల్కొండ, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. గచ్చిబౌలిలో, షేక్ పేట్ ప్రాంతాల్లో రోడ్లపైన నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ జాం అయింది. చందానగర్ లో అత్యధికంగా 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మియాపూర్ లో 4.38 సెంటిమీటర్లు, షేక్ పేటలో 4.2, కేపీహెచ్ బీలో 3.1, మాదాపూర్ లో 3, గోల్కొండలో 2.9, బంజారాహిల్స్ లో 2.7, గచ్చిబౌలిలో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. శనివారం  కావడంతో  ఐటీ కారిడార్ ప్రాంతాల్లో  ట్రాఫిక్ కష్టాలు తప్పాయి.