
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావలసిన ఐదు విమానాలు దారిమళ్లించారు అధికారులు. పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన మూడు విమానాలను విజయవాడకు మళ్ళించిన ఆధికారులు.. మరో రెండు విమానాలను తిరుపతి, బెంగళూరుకు మళ్ళించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో దారి మళ్లించినట్లు తెలిపారు ఆధికారులు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా తెలంగాణతో పాటు ఏపీలో పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ప్రధాన రహదారులు చెరువుల్లా తలపిస్తున్నాయి.తెలంగాణ, ఏపీల్లో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. చెరువులు, కుంటలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఈ రోజు (బుధవారం,ఆగస్టు 13) తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి , ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ , యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.