Hyderabad Rains: హైదరాబాద్లో మారిపోయిన వాతావరణం.. ఈ ఏరియాల్లో ఫుల్లు వర్షం !

Hyderabad Rains: హైదరాబాద్లో మారిపోయిన వాతావరణం.. ఈ ఏరియాల్లో ఫుల్లు వర్షం !

హైదరాబాద్: హైదరాబాద్లో సోమవారం రాత్రి సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం ఎండలు మండిపోయాయి. రాత్రికి వాతావరణం చల్లబడింది. మిన్ను విరిగి మీద పడ్డట్టుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, కృష్ణానగర్ ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో వర్షం పడింది.

కరీంనగర్ టౌన్లో కూడా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. కుమ్రం భీమ్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో  కూడిన భారీ వర్షం కారణంగా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా కింద పడింది. ఈ రోజు నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతం ఉత్తర దక్షిణ ద్రోణి ఈరోజు ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి మారత్వాడా, తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్నాటక వరకు సగటు సముద్రమట్టం నుచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరో ద్రోణి ఈ రోజు బలహీనపడింది. ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈరోజు నుంచి వచ్చే మరో రెండు రోజుల పాటు ఎండ తీవ్రత తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.