వానలు షురూ..పెరిగిన దోమల బెడద

వానలు షురూ..పెరిగిన దోమల బెడద
  • ఇక్కడే ఎక్కువగా డెంగీ కేసులు
  • 33,500 మస్కిటో బ్రీడింగ్ పాయింట్లను గుర్తించిన బల్దియా
  • జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటిప్రాంతాల్లోనూ హాట్ స్పాట్లు

హైదరాబాద్, వెలుగు: వానలు షురూ అవడంతో గ్రేటర్​లో దోమలు బెడద పెరిగింది. 250 ప్రాంతాల్లో దండయాత్ర చేస్తున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న డెంగీ కేసులు ఎక్కువగా ఇక్కడి నుంచే వస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. వీటిని సమస్యాత్మక ప్రాంతాలుగా ప్రకటించారు. అలాగే 33,500 దోమల బ్రీడింగ్​పాయింట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ కొన్నిచోట్ల మినహా పెద్దగా కనిపించడం లేదు. అలాగే సిటీలోని ఫీవర్, నిలోఫర్ సహా అన్ని సర్కారు హాస్పిటల్స్​కు వస్తున్న వారిలో ఎక్కువ మంది సీజనల్​వ్యాధులతో బాధపడుతున్నవారే ఉంటున్నారు. సాయత్రం 6 తర్వాత ఇండ్లల్లో దోమల బ్యాట్ లు, మస్కిటో కాయిల్స్ వాడాల్సిన పరిస్థితి ఉంది.  
ఇక్కడే ఎక్కువగా..

మూడేళ్లలో ఎక్కువగా డెంగీ, మలేరియా వ్యాధులు నమోదైన ప్రాంతాలను జీహెచ్ఎంసీ ఎంటమాలజీ అధికారులు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో దోమల వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉందని ప్రకటించారు. ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. 16,192 తాళం వేసిన ఇండ్లు, 5,385 ఓపెన్ ప్లాట్లు, 4,540 సెల్లార్లు, 765 ఫంక్షన్ హాల్స్, కన్ స్ట్రక్షన్ జరుగుతున్న 11,500 ప్రాంతాల్లో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
జూబ్లీహిల్స్​లోని షౌకత్ నగర్, బంజారాహిల్స్​ లోని జీబీ నగర్, మెహిదీపట్నంలోని ఉప్పర్ బస్తీ, సనత్ నగర్, బల్కంపేట, సంతోష్ నగర్, సికింద్రాబాద్, లాలాపేట, ఎల్బీనగర్, హయత్​నగర్ తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అధికారులు కూడా ఈ ప్రాంతాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. జనవరి నుంచి ఇప్పటివరకు ఈ ఏడాది 450 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్​జిల్లాల్లో డైలీ ఒక్కో జిల్లాలో 20 వరకు కేసులు నమోదవుతున్నాయి.

మూసీ ప్రాంతాల్లో మరింతగా.. 
సాయంత్రం 5 గంటల తర్వాత మూసీ తీర ప్రాంతాల్లో దోమలు దండయాత్ర చేస్తున్నాయి. కాలనీల్లో నడుచుకుంటూ వెళుతుంటే  నోట్లోకి దోమలు వస్తున్నాయని జనం అంటున్నారు. మూసారాంబాగ్, లంగర్ హౌజ్, మలక్ పేట, చాదర్​ఘాట్, శంకర్ నగర్​ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మూసీ ప్రాంతాల్లో దోమల నియంత్రణకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు  చెబుతున్నారు. 

తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన
రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరిన. ఐమాక్స్​పక్కన కన్​స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నం. అక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి. నాతోపాటు మరో ఐదుగురికి హెల్త్ ప్రాబ్లమ్​ వచ్చింది. ఎందుకిలా అయిందో అర్థం కావడం లేదు. అంతా ఖైరతాబాద్ లోని సర్కారు హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నం. ఇంకో రెండు రోజులు ఉండమని డాక్టర్లు చెప్పారు.  - మిథున్, ఫీవర్ ​పేషెంట్

లక్షణాలు ఉంటే టెస్టులు చేయించాలె
నెల రోజులుగా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. మే నెలలో 20కిపైగా, ఈ నెలలో ఇప్పటివరకు15కి పైగా నమోదయ్యాయి. ఓపీల సంఖ్య 600కు పెరిగింది. ఇందులో 40 శాతం సీజనల్ ​వ్యాధులతో వస్తున్నారు. ప్లేట్ లెట్ల​ కౌంట్​ 20 వేలకు పడిపోతే  వాటిని ​ ఎక్కించాల్సి ఉంటుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం, విరేచనాలు, వాంతులు, దద్దుర్లు, జర్వం డెంగీ లక్షణాలు. ఇవి ఉంటే డాక్టర్​ను కలిసి టెస్టులు చేయించుకోవాలి. - డాక్టర్ శంకర్, ఫీవర్ హాస్పిటల్ ​సూపరింటెండెంట్

అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నం
దోమల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నం. గత మూడేండ్లలో డెంగీ కేసులు ఎక్కువ వచ్చిన ప్రాంతాలపై మరింత ఫోకస్​పెట్టాం. డెంగీ కేసులు పెరగకుండా జాగ్రత్త పడుతున్నం. అన్ని ప్రాంతాల్లో యాంటీ లార్వా, పైరత్రామ్, ఐఆర్ఎస్​ స్ప్రే, ఫాగింగ్, చెరువులు, కుంటల వద్ద డ్రోన్ల దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నం. జనం కూడా ఇంటి ముందు నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. - డాక్టర్​ రాంబాబు, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ చీఫ్​