హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురు గాలులు వీచే చాన్స్ ఉందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల తదితర జిల్లాల్లో ఆది, సోమవారం మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో టెంపరేచర్లు, ఉక్కపోత కూడా తీవ్రంగానే నమోదవుతున్నాయి.
రెండ్రోజులుగా టెంపరేచర్లు కాస్త తగ్గినా.. ఎండ వేడి ఎక్కువగానే ఉంటోంది. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 42.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూర్‌లో 42.4 డిగ్రీలు, ఖమ్మం జిల్లా ప్రకాశ్‌నగర్, భద్రాద్రి జిల్లా మణుగూరు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జంబుగ, జయశంకర్ జిల్లా మహదేవ్‌పూర్‌లో 42.2, సూర్యాపేట జిల్లా మునగాలలో 42.1, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 42 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డయ్యాయి.
