
రంగారెడ్డి: హైదరాబాద్ సిటీ శివారులో వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్ దేవ్ పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం అంతా ఎండ , సాయంత్రం ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు, రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈరోజు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది.
రేపు(మే 12, 2025) ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం మరియు కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.