హైదరాబాదే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న వానలు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

హైదరాబాదే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న వానలు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

పది పదిహేను రోజులు వర్షాలు లేక పంటలు ఎండుతున్న రైతులకు వాతావరణం చల్లటి జల్లులతో తీపి కబురు చెప్పింది. సోమవారం (ఆగస్టు 04) తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కుండపోత వాన కురవటంతో రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని ముందుగా వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

అనుకున్నట్లుగానే వర్షాలు రాష్ట్రం అంతటా విస్తరించాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం రైతులకు కాస్త రిలీఫ్ అని చెప్పవచ్చు. రంగారెడ్డి, వికారదాబాద్, నల్గొండ జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 

ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మంచిర్యాలు, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గాలి వేగం  గరిష్టంగా గంటకు 40 కి.మీ కంటే తక్కువ (గాలులలో)  ఉండగా.. తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం వుందని తెలిపారు.

మరోవైపు హైదరాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం వచ్చే అవకాశం వుంది.