రాజస్థాన్​లో 68 % పోలింగ్.. కరణ్​పూర్ సెగ్మెంట్ ఎలక్షన్ పోస్ట్​పోన్

రాజస్థాన్​లో 68 % పోలింగ్.. కరణ్​పూర్ సెగ్మెంట్ ఎలక్షన్ పోస్ట్​పోన్

జైపూర్:  రాజస్థాన్​లో మొత్తం 200 నియోజకవర్గాలు ఉండగా.. శనివారం 199 సెగ్మెంట్లకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 68.24 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 51వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కరణ్‌‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్మీత్ సింగ్ కూనార్ చనిపోవడంతో 199 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1,862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.70 లక్షల మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

పోలింగ్ కేంద్రాల్లో గుండెపోటుతో ఇద్దరు మృతి

పాలీ జిల్లా సుమీర్​పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న జోరారాం కుమావత్ పోలింగ్ ఏజెంట్ శాంతిలాల్ బూత్ నంబర్ 47లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతన్ని దగ్గర్లోని హాస్పిటల్​కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఉదయ్​పూర్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన సత్యేంద్ర అరోరా (62) గుండెపోటుతో చనిపోయాడు.

సిరోహి జిల్లా పిండ్వాడా అబు నియోజకవర్గంలోని చార్వాలీ గ్రామస్తులు పోలింగ్​ను బహిష్కరించారు.  గ్రామ పంచాయతీ మార్పు, రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంతోనే ఎన్నికలు బహిష్కరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఊర్లో 890 ఓటర్లు ఉన్నారు. సికార్‌‌లోని బోచివాల్ భవన్, ఫతేపూర్ షెఖావతి దగ్గర్లోని పోలింగ్​ కేంద్రాల వద్ద ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఢోల్​పూర్ జిల్లాలోని బారీ సెగ్మెంట్​లో కూడా రెండు పార్టీల మద్దతుదారులు గొడవ పడ్డారు. 

ఓటు వేసిన సీఎం, కేంద్ర మంత్రులు

గవర్నర్ కల్‌‌రాజ్ మిశ్రా జైపూర్‌‌ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం అశోక్​ గెహ్లాట్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జోధ్​పూర్​లో, కైలాశ్ చౌదరి బాలోత్రా, మాజీ సీఎం వసుంధర రాజే, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ జైపూర్​లో ఓటు వేశారు. రాజస్థాన్ బీజేపీ స్టేట్ చీఫ్ సీపీ జోషి చిత్తోడ్​గఢ్, ఎంపీలు దియా కుమారి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జైపూర్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మళ్లీ అధికారంలోకి వస్తం

రాజస్థాన్​లో మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని సీఎం అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్నారు. బీజేపీ లీడర్లు మోదీ, అమిత్ షాతో పాటు బయటి నుంచి వచ్చిన లీడర్లంతా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని విమర్శిం చారు. ఎవరేంటో ప్రజలకు తెలుసని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేశామన్నారు. ప్రజ లంతా తమవెంటే ఉన్నారని వివరించారు.

అశోక్ గెహ్లాట్

కమలం వికసించడం ఖాయం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించడం ఖాయమని మాజీ సీఎం వసుంధర రాజే అన్నారు. తాము ఎవరినీ రెచ్చగొట్టలేదన్నారు. కాంగ్రెస్​కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే అశోక్ గెహ్లాట్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన కామెంట్లను ఖండించారు.ఐదేండ్ల కాంగ్రెస్​ పాలనతో రాజస్థాన్ ప్రజలు విసిగిపోయారని అన్నారు.

వసుంధర రాజే