బీజేపీపై రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు

బీజేపీపై రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు

జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితుల్లో ఒకరికి బీజేపీతో సంబంధాలున్నాయని చెప్పారు. ఈ విషయంపై ఆ పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉదయ్‍పూర్‌ హత్య కేసు ఇద్దరు నిందితుల్లో ఒకరికి బీజేపీకి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో అందరికీ తెలుసన్నారు. నిందితుడు రియాజ్ అఖ్తారీ ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న విషయం ఇటీవలే తెలిసిందని, అతను ఇంటి కిరాయి కట్టడం లేదని ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడని చెప్పారు. అయితే విచారణ మొదలుపెట్టకముందే బీజేపీ కార్యకర్తలు నిందితుడు తమ వాడని పోలీసులకు చెప్పారని, పార్టీ కార్యకర్త అయినందున అతనికి ఎలాంటి ఇబ్బంది కల్గించవద్దన్నారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. హత్య కేసు నిందితుడిపై పోలీసు కేసు నమోదు కాకుండా ఆపేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై బీజేపీ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన రియాజ్ అఖ్తారీ..బీజేపీ నేతలతో దిగిన ఫోటో వైరల్‌గా మారింది. ఇందులో రాజస్థాన్ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా కూడా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే బీజేపీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తమపై వస్తున్న ఆరోపణలను బీజేపీ ఖండించింది. 

మ‌హ‌మ్మద్ ప్రవ‌క్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మకు మద్దతుగా సోష‌ల్ మీడియాలో పోస్టు చేసినందుకు ఉదయ్‌పూర్‌కు చెందిన కన్హయ్య లాల్ అనే టైలర్ ను జూన్ 28వ తేదీన ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈఘటన దేశవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ మర్డర్ కేసులో ఇప్పటి వరకు 7 మందిని అరెస్టు చేశారు.