వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే

వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే
  • గొడవతో గెహ్లాట్​కు సంబంధంలేదు
  • రాజస్థాన్​లో పరిస్థితిపై సోనియాకు మాకెన్ రిపోర్టు

న్యూఢిల్లీ: రాజస్థాన్​ కాంగ్రెస్​లో సంక్షోభానికి కారణం ముగ్గురు ఎమ్మెల్యేనని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి అజయ్​ మాకెన్​ హైకమాండ్​కు తేల్చిచెప్పారు. సీఎం అశోక్​ గెహ్లాట్​కు ఈ వ్యవహారంలో సంబంధం లేదంటూ క్లీన్​ చిట్​ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం పార్టీ చీఫ్​ సోనియా గాంధీకి రిపోర్టు అందజేశారు. పార్టీ ఎమ్మెల్యేలలో.. చీఫ్​ విప్ ​మహేశ్​ జోషి, ఆర్టీడీసీ చైర్మన్​ ధర్మేంద్ర రాథోడ్, శాంతి కుమార్​ ధరీవాల్​లపై చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ కట్టుబాట్లను తప్పి, ఎమ్మెల్యేలతో కలిసి మీటింగ్​ పెట్టడం తీవ్ర క్రమశిక్షణారాహిత్యమని ఆరోపించారు. ఓవైపు సీఎల్పీ మీటింగ్​కు హాజరుకావాలని హైకమాండ్​ ఆదేశించినా వినిపించుకోకుండా, మీటింగ్​ పెట్టి తదుపరి సీఎం ఎన్నికపై తీర్మానం చేశారని మాకెన్​ విమర్శించారు. రాజస్థాన్​ సీఎం రేసు నుంచి సచిన్​ పైలట్​ను తప్పించాలని ఈ మీటింగ్​లో చర్చించారన్నారు. గెహ్లాట్​ను సీఎం పోస్టు నుంచి తప్పిస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నట్లు ఆ తీర్మానంలో వివరించారని చెప్పారు. ఈ వ్యవహారంతో సీఎం గెహ్లాట్​కు ఎలాంటి సంబంధంలేదని మాకెన్ తన రిపోర్టులో పేర్కొన్నారు. మాకెన్​ రిపోర్టుతో సదరు ఎమ్మెల్యేలకు షోకాజ్​ నోటీసులు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ అందులో పార్టీ హైకమాండ్​ ఆదేశించినట్లు వివరించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ ప్రెసిడెంట్​ రేసులో అశోక్​ గెహ్లాట్​ ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో గెహ్లాట్​ పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్​ వేసేందుకే గెహ్లాట్ సుముఖంగా ఉన్నారని చెప్పాయి. మరోవైపు, మంగళవారం మధ్యాహ్నం సచిన్​ పైలట్​ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన తన పర్సనల్​ పనిమీదనే ఢిల్లీకి వెళ్లారని పైలట్​ అనుచరులు చెప్పారు.