IPL 2025: ఇద్దరూ సఫారీ ఆటగాళ్లే: సందీప్ శర్మ, నితీష్ రాణా స్థానాల్లో రీప్లేస్ మెంట్ ప్రకటించిన రాజస్థాన్

IPL 2025: ఇద్దరూ సఫారీ ఆటగాళ్లే: సందీప్ శర్మ, నితీష్ రాణా స్థానాల్లో రీప్లేస్ మెంట్ ప్రకటించిన రాజస్థాన్

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కీలక ఆటగాళ్లు సందీప్ శర్మ, నితీష్ రాణా గాయాల కారణంగా ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యారు. వీరిద్దరి స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్ రీప్లేస్ మెంట్ ను ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ సౌతాఫ్రికా పేసర్ నాండ్రే బర్గర్‌ను ఎంపిక చేసింది. ఈ సీజన్‌లో సందీప్ 10 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీశాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ సందీప్ గాయపడ్డాడు. సందీప్ స్థానంలో వచ్చిన నంద్రే బర్గర్ రూ. 3.5 కోట్లకు ఆర్ఆర్‌లో చేరాడు. గత సీజన్ లో రాజస్థాన్ తరపున ఆడిన ఈ సఫారీ పేసర్ 6 మ్యాచ్ ల్లో 7 వికెట్లు పడగొట్టాడు.

ఇటీవలే గాయపడిన నితీష్ రాణా ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యాడు. అతని స్థానంలో రాజస్థాన్ రాయల్స్ లువాన్-డ్రే ప్రిటోరియస్‌ను ఎంపిక చేసింది. ప్రిటోరియస్‌ రూ. 30 లక్షలకు  రాజస్థాన్ జట్టులో చేరతాడు. సౌతాఫ్రికాకు చెందిన లువాన్-డ్రే ప్రిటోరియస్ 33 టీ20ల్లో  911 పరుగులు చేశాడు. ఈ ఏడాది జరిగిన సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ లో సంచలన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.  ఈ సీజన్ లో సందీప్ శర్మ, నితీష్ రాణా ఇద్దరూ కూడా ఘోరంగా విఫలమయ్యారు. ఒకటి రెండు మ్యాచ్ లు మినహాయిస్తే వీరు దాదాపు ప్రతి మ్యాచ్ లో నిరాశపరిచారు. 

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతను తరవాత జరగబోయే మ్యాచ్ ల్లో ఆడతాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్  ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి వైదొలగింది. ఆ జట్టు ఆడిన 12 మ్యాచ్ లో కేవలం 3 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో నిలిచింది. ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో భాగంగా మే 12 చెన్నై సూపర్ కింగ్స్ తో.. మే 16న పంజాబ్ కింగ్స్ తో తలపడాల్సి ఉంది.