సన్ రైజర్స్ పై రాజస్తాన్ గ్రాండ్ విక్టరీ

సన్ రైజర్స్ పై రాజస్తాన్ గ్రాండ్ విక్టరీ

పుణె: సీజన్లు మారుతున్నా.. ఐపీఎల్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ ఆటతీరు మాత్రం మారడం లేదు. కొత్త ప్లేయర్లతో సరికొత్తగా బరిలోకి దిగినా..​15వ సీజన్​ను  ఘోర పరాజయంతో ప్రారంభించింది. మరోవైపు రాజస్తాన్​ రాయల్స్​ ఘన విజయంతో లీగ్​ను షురూ చేసింది. బ్యాటింగ్‌‌లో కెప్టెన్ సంజూ శాంసన్ (27 బాల్స్ లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 55), దేవదత్‌‌ పడిక్కల్ (29 బాల్స్ లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 41) మెరుపులు మెరిపించడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో రాయల్స్‌‌ 61 రన్స్‌‌ తేడాతో హైదరాబాద్‌‌ను ఓడించింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన రాజస్తాన్‌‌ 20 ఓవర్లలో 210/6 భారీ స్కోరు చేసింది. ఛేజింగ్​లో హైదరాబాద్‌‌ 20 ఓవర్లలో 149/7 స్కోరు మాత్రమే చేసి ఓడింది. టాపార్డర్‌‌ పూర్తిగా నిరాశపర్చగా, లోయర్‌‌ ఆర్డర్‌‌లో మార్‌‌క్రమ్‌‌ (41 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57), వాషింగ్టన్​ సుందర్​ (40)  పోరాడారు. శాంసన్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

టాప్‌‌ లేపారు..

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో హైదరాబాద్‌‌ టాపార్డర్‌‌ బొక్కబోర్లా పడింది. ప్రసిధ్‌‌ కృష్ణ (2/16), బౌల్ట్‌‌ (2/23), చహల్‌‌ (3/22) కట్టుదిట్టమైన బౌలింగ్‌‌ ముందు.. కెప్టెన్‌‌ విలియమ్సన్‌‌ (2), అభిషేక్‌‌ శర్మ (9), రాహుల్‌‌ త్రిపాఠి (0), నికోలస్‌‌ పూరన్‌‌ (0) సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. పవర్‌‌ప్లేలో 14/3 స్కోరు మాత్రమే చేసిన హైదరాబాద్‌‌ తొలి 10 ఓవర్లలో 36/4 స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్‌‌ బౌలర్ల దెబ్బకు 37 రన్స్‌‌కే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మార్‌‌క్రమ్‌‌ ఓ ఎండ్‌‌లో ఒంటరి పోరాటం చేశాడు. వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టాడు. రెండో ఎండ్‌‌లో అబ్దుల్‌‌ సమద్‌‌ (4) విఫలమైనా, షెఫర్డ్‌‌ (24) కాసేపు అండగా నిలిచాడు. 78/6 వద్ద క్రీజులోకి వచ్చిన సుందర్‌‌ చివర్లో విలువైన ఇన్నింగ్స్‌‌ ఆడాడు. మార్‌‌క్రమ్‌‌తో కలిసి ఏడో వికెట్‌‌కు 55 రన్స్‌‌ జోడించాడు. కానీ, చేయాల్సిన రన్‌‌రేట్‌‌ భారీగా పెరిగిపోవడంతో హైదరాబాద్‌‌కు ఓటమి తప్పలేదు. 

శాంసన్‌‌.. షో

తొలుత రాజస్తాన్‌‌ ఇన్నింగ్స్​ మొత్తం మెరుపులతో సాగింది. ఓపెనర్లు బట్లర్ (35), యశస్వి (20) తొలి వికెట్‌‌కు 58 రన్స్‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే రెండు ఓవర్ల తేడాలో ఈ ఇద్దరూ ఔట్‌‌కావడంతో కాస్త నెమ్మదించిన  రాజస్తాన్‌‌ ఇన్నింగ్స్‌‌ను  శాంసన్‌‌, పడిక్కల్‌‌ మళ్లీ నిలబెట్టారు. హైదరాబాద్‌‌ బౌలింగ్‌‌లో పస లేకపోవడంతో అటాకింగ్‌‌ గేమ్‌‌ ఆడిన ఈ ఇద్దరు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దాంతో పవర్‌‌ప్లేలో 58/0 స్కోరు చేసిన రాజస్తాన్‌‌ సగం ఓవర్లకు  87/2తో మంచి స్థితిలో నిలిచింది.  సుందర్‌‌ బౌలింగ్‌‌లో శాంసన్‌‌ 6, 4 కొడితే, తర్వాతి ఓవర్లో పడిక్కల్‌‌ దీన్ని రిపీట్‌‌ చేశాడు. ఇక 14వ ఓవర్లో పడిక్కల్‌‌ 4, 6, 4తో 17 రన్స్‌‌ రాబట్టాడు. ఫిఫ్టీకి దగ్గరైన  పడిక్కల్‌‌.. ఉమ్రాన్‌‌ మాలిక్‌‌కు వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. ఫలితంగా థర్డ్‌‌ వికెట్‌‌కు 73 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 16వ ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా వరుసగా  రెండు కళ్లుచెదిరే సిక్స్ లు బాదిన శాంసన్ 25 బాల్స్ లోనే  హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ భువనేశ్వర్​ వేసిన తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్ కే భారీ షాట్ ఆడబోయి లాంగాన్ లో సమద్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లో హెట్‌‌మయర్ ( 13 బాల్స్ లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32) , రియాన్ పరాగ్ (8 బాల్స్ లో12) దాటిగా ఆడారు. 18వ ఓవర్లో 4, 6, 4తో 18 రన్స్‌‌, తర్వాతి ఓవర్‌‌లో 6, 6తో 15 రన్స్‌‌ వచ్చాయి. ఇక,  చివరి ఓవర్లో  నటరాజన్‌‌.. హెట్‌‌మయర్‌‌, పరాగ్‌‌ను ఔట్‌‌ చేసినా అప్పటికే రాజస్తాన్‌‌ స్కోరు 200 దాటేసింది. ఉమ్రాన్‌‌, నటరాజన్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు.