సూపర్‌స్టార్ రజనీకాంత్ పేరు వింటేనే ఫ్యాన్స్ లో పూనకాలే. డెబ్బై ఐదేళ్ల వయసులోనూ అదే జోష్, అదే స్టైల్, అదే క్రేజ్ కుర్ర హీరోలతో పోటీపడుతున్నారు. అయితే వెండితెరపై వన్-మ్యాన్ షో చేసే రజనీకి, రియల్ లైఫ్‌లో మాత్రం ఒక పెద్ద తలనొప్పి వచ్చి పడింది. అదే.. సోషల్ మీడియా ట్రోలింగ్. లేటెస్ట్ గా చెన్నైలో జరిగిన ఆయన కొత్త సినిమా 'ధర్మన్' మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్ పై తలైవా ఓపెన్ అయ్యారు. తన మనసులోని ఆవేదనను, కాస్త నవ్వుతూనే.. చాలా ఘాటుగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నోరు విప్పినా గొడవే.. మూసుకున్నా గొడవే!
వేదికపై మైక్ అందుకున్న రజనీకాంత్.. తనపై జరుగుతున్న నిరంతర విమర్శలు, ట్రోల్స్ పై తనదైన శైలిలో స్పందించారు. ఈ మధ్య కాలంలో ఎవరైనా నన్ను వేదికపైకి వచ్చి మాట్లాడమని పిలిస్తేనే ఒకలాంటి భయం, సంకోచం కలుగుతున్నాయి. ఎందుకంటే.. నేను మాట్లాడితే అది పెద్ద సమస్య అయిపోతోంది. అది నాకో, లేదా మీకో.. మొత్తానికి ఏదో ఒక రూపంలో వివాదంగా మారుతోంది అని రజనీకాంత్ పేర్కొన్నారు.
అంతేకాదు, మాట్లాడకపోతే వదిలేస్తారా అంటే అదీ లేదు. నేను గప్‌చుప్‌గా మౌనంగా ఉంటే.. వీడేంటి అస్సలు మాట్లాడటం లేదు, నోట్లో ఏమైనా స్వీటు పెట్టుకున్నాడా? అని ఎగతాళి చేస్తారు. సరే కదా అని నోరు విప్పితే.. అసలు ఇప్పుడెందుకు మాట్లాడాడు? ఈ టైమ్‌లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మాట్లాడకుండా ఉండాల్సింది అంటూ ఇంకొక వర్గం రెడీ అయిపోతుంది అంటూ రజినీ నవ్వుతూనే చురకలు అంటించారు.
జీవిత సత్యం గ్రహించిన తలైవా..
చాలా ఏళ్ల తర్వాత నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. మనల్ని ఇష్టపడని వాళ్లకు మనం ఏం చేసినా, ఎంత మంచి చేసినా నచ్చదు. అలాగే, మనల్ని ఇష్టపడేవాళ్లు మనం ఏం చేసినా గుడ్డిగా సమర్థిస్తారని, అంతా నచ్చుతుందని అనుకోవడం కూడా మూర్ఖత్వమే. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అని రజనీకాంత్ హెచ్చరించారు. రాజకీయ నాయకులతో లంచ్ మీటింగ్‌లు, మర్యాదపూర్వక భేటీల వల్ల ఈ మధ్య కాలంలో ఆయన తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వాటిపైనే ఆయన ఇలా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
క్రేజీ కాంబినేషన్స్..
ఇక సినిమాల విషయానికి వస్తే, రజనీకాంత్ స్పీడ్ చూసి కుర్ర హీరోలు కూడా కుళ్లుకోవాల్సింది. వరుస సినిమాలతో ఫుల్ జోరులో ఉన్నారు. లేటెస్ట్ చిత్రం 'ధర్మన్' గురువారం నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తుండగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీలో సిమ్రాన్, రాశిఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. అటు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' కూడా లైన్లోనే ఉంది. వీటన్నిటికీ మించి, కమల్ హాసన్ - రజనీకాంత్ కలిసి నటించబోయే ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ 2027లో పట్టాలెక్కనుందని టాక్. దీనికి కూడా నెల్సన్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది.
