రాజ్యసభలో ‘లుంగీవాలా’ రగడ.. మర్యాద లేని కామెంట్స్ అంటూ ఆగ్రహం

రాజ్యసభలో ‘లుంగీవాలా’ రగడ.. మర్యాద లేని కామెంట్స్ అంటూ ఆగ్రహం

న్యూఢిల్లీ : సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌‌ను బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్‌‌ ‘లుంగీవాలా’ అంటూ అవమానకరంగా సంబోధించారన్న ఆరోపణలపై రాజ్యసభలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే బ్రిట్టాస్‌‌ ‘లుంగీవాలా’ వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించారు. ఆయనకు విపక్ష ఎంపీలు మద్దతు పలికారు. దీంతో చైర్మన్‌‌ సీపీ రాధాకృష్ణన్‌‌ స్పందించారు. 

సంబంధిత ఎంపీలను తన చాంబర్‌‌కు పిలిచి మాట్లాడతానని తెలిపారు. సభ్యులు ఇతరుల ప్రసంగాలను అడ్డుకునే సమయంలో మర్యాద లేని వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. సహచర సభ్యుల మనోభావాలను దెబ్బతీయకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. 

ప్రాంతీయ గుర్తింపులను అవమానించకూడదని పేర్కొన్నారు. సోమవారం ఎగువ సభలో ఆదాయపు పన్ను (సవరణ) ఆర్డినెన్స్‌‌–2026పై తీర్మానం ప్రవేశపెడుతున్న సమయంలో సుస్మితా దేవ్‌‌ తనను పదేపదే ‘లుంగీవాలా’ అని పిలిచారని ఆరోపించారు. ఈ అంశంపై ఆమెపై ఇప్పటికే ప్రివిలేజ్‌‌ మోషన్‌‌ ఇచ్చినట్లు చెప్పారు. 

బ్రిట్టాస్‌‌ వాదన విన్న తర్వాత సుస్మితా దేవ్‌‌కు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌‌ రిజిజు, సభా నాయకుడు జేపీ నడ్డా కోరారు. మరోవైపు కాంగ్రెస్‌‌ నేతృత్వంలోని విపక్ష సభ్యులు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. అయోధ్య రామ మందిరానికి ఇచ్చిన విరాళాల సొమ్ము చోరీకి గురైందంటూ నినాదాలు చేశారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగడంతో చైర్మన్‌‌ సభను వాయిదా వేశారు.