రేపు రైతుల మహా ధర్నా

రేపు రైతుల మహా ధర్నా

హైదరాబాద్‌‌, వెలుగు: ఆలిండియన్‌‌ కిసాన్‌‌ సంఘర్ష్‌‌ కోఆర్డినేషన్‌‌ కమిటీ (ఏఐకెఎస్‌‌సీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 25న హైదరాబాద్‌‌ ఇందిరాపార్క్‌‌ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు కమిటీ నేతలు తెలిపారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌‌ చేస్తూ ఢిల్లీ బార్డర్లలో చేపట్టిన రైతుల పోరాటం మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ ధర్నా చేపట్టినట్లు వెల్లడించారు. ఈ పోరాట స్ఫూర్తితో కనీస మద్దతు ధరల చట్టాన్ని సాధిస్తామన్నారు. దీనికి సంబంధించి మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐకేఎస్‌‌సీసీ నాయకులు విస్సా కిరణ్, టి.సాగర్, పశ్య పద్మ, రాయల చంద్రశేఖర్, వెంకటరమణ, కోటేశ్వర రావు, అనిల్ కుమార్‌‌‌‌ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. ఈ ధర్నాకు కిసాన్‌‌ మోర్చా జాతీయ నాయకులు రాకేశ్‌‌ తికాయత్‌‌, హన్నన్‌‌ మొల్ల, ఆశిష్ మిట్టల్‌‌, జగ్తార్‌‌‌‌ బాజ్వా హాజరు కానున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. కనీస మద్దతు ధర చట్టం చేయడం, విద్యుత్‌‌ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవడం, ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, రైతు అమరవీరుల కుటుంబాలకు పరిహారం, లఖీంపూర్ ఖేరిలో ఘటనలో కేంద్ర మంత్రి అజయ్‌‌ కుమార్‌‌‌‌ మిశ్రాను బర్తరఫ్‌‌ చేసి అరెస్ట్‌‌ చేయాలని డిమాండ్‌‌ చేశారు. తెలంగాణలో వడ్లు కొనాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వర్షాలతో పంటలు నష్ట పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు.