బాక్సాఫీస్ దగ్గర అసలైన పోరు మొదలైంది. జూన్ ఫస్ట్ వీక్ థియేటర్లలో భారీ యుద్ధానికి తెరలేవబోతోంది. ఒకవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ 'పెద్ది' (Peddi) ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న రిలీజ్‌కు కానుంది. మరోవైపు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటించిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' జూన్ 5న రేసులోకి వస్తోంది. అయితే హిందీ బెల్ట్‌లో ' పెద్ది ' మూవీని జియో స్టూడియోస్ సమర్పిస్తుంది. దీంతో బాలీవుడ్ మేకర్స్ రూట్ మార్చేశారు. చరణ్ మాస్ రాంపేజ్‌ను తట్టుకోవడానికి వరుణ్ ధావన్ సినిమా టీమ్ ఏకంగా ఒక సెన్సేషనల్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది.
సగం ధరకే టికెట్..
డేవిడ్ ధావన్ ల్యాండ్‌మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై ' సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకున్నాయి. కానీ, 'పెద్ది' క్రియేట్ చేస్తున్న హైప్‌తో ఒంటరిగా పోరాడటం కష్టమని భావించిన నిర్మాత రమేష్ తౌరానీ , ఓపెనింగ్ రోజైన జూన్ 5న టికెట్ ధరలపై ఏకంగా 50 శాతం డిస్కౌంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
కండిషన్స్ ఇవే..
అయితే ఈ సినిమా టికెట్ ధరలపై 50 శాతం డిస్కౌంట్ పొందాలంటే కొన్ని కండిషన్స్ పెట్టింది. బుక్‌మైషో (BookMyShow) లో కనీసం రెండు టికెట్లు బుక్ చేసుకోవాలి. అది కూడా గరిష్టంగా రూ. 200 వరకు ఉన్న టికెట్లపైనే ఈ 50 శాతం తగ్గింపు వర్తిస్తుంది. ఈ క్రేజీ ఆఫర్ కేవలం రిలీజ్ రోజైన జూన్ 5కు మాత్రమే పరిమితం అని మేకర్స్ తెలిపారు.టాలీవుడ్ హీరోల పాన్-ఇండియా మార్కెట్ దెబ్బకు బాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు ఇలా రిలీజ్ రోజే రేట్లు తగ్గించుకోవాల్సి రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతకుముందు కరణ్ జోహార్ 'చంద్ మేరా దిల్' సినిమాకు కూడా ఇలాంటి ఆఫరే పెట్టారు.
గెలుపెవరిది?
పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లతో వరుణ్ ధావన్ రొమాంటిక్ కామెడీతో వస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం 'పెద్ది'తో ఊరమాస్ యాక్షన్ విందును వడ్డించబోతున్నారు. ఒకవైపు నార్త్ ఆడియన్స్‌ను ఆకర్షించడానికి వరుణ్ ధావన్ టీమ్ 'డిస్కౌంట్' అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే.. రామ్ చరణ్ తన గ్లోబల్ ఇమేజ్ , జియో స్టూడియోస్ సపోర్ట్‌తో హిందీ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు ఎలాంటి రికార్దులు సృష్టిస్తాయో చూడాలి.
