రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ మోస్ట్ ఎవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మే4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రేపు జూన్ 3 రాత్రి 8 గంటలకు ఏపీలో స్పెషల్ ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ఈ షోకు టికెట్ ధర రూ.600 (జీఎస్‌టీతో కలిపి). ఇప్పటికే ఏపీలో బుకింగ్స్ ఓపెన్ అయ్యి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రేపటిలోపు తెలంగాణాలో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇదంతా పెద్ది విడుదలకు అంచనాలు పెంచడానికి జరిగిన బిజినెస్ లెక్కలు. మరి రిలీజ్ అయ్యాక బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సాధించాల్సిన వసూళ్లు ఎంత? పెద్ది జరిపిన బిజినెస్ ఎంత? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం.
రికార్డు స్థాయిలో ‘పెద్ది’ బిజినెస్..
ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, డిస్ట్రిబ్యూటర్లు ‘పెద్ది’ మూవీని భారీ ధరలకు హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే ఈ చిత్రం రూ.135 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సమాచారం. నైజాం ఏరియాలో దాదాపు రూ.48 కోట్లకు హక్కులు విక్రయించబడగా, రాయలసీమ (సీడెడ్) ప్రాంతంలో రూ.24 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
అలాగే ఆంధ్ర ప్రాంతంలోని ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాల థియేట్రికల్ హక్కులు కలిపి రూ.63.25 కోట్లకు పైగా అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘పెద్ది’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. విదేశీ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.34 కోట్లకు అమ్ముడవ్వగా, ఈ ఏడాది ఒక తెలుగు సినిమాకు జరిగిన అతిపెద్ద ఓవర్సీస్ డీల్స్‌లో ఇది ఒకటిగా నిలిచింది.
ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే..
కర్ణాటక – రూ.17 కోట్లు
హిందీ మార్కెట్ & రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.25 కోట్లు
తమిళనాడు & కేరళ – రూ.7.25 కోట్లు
మొత్తంగా అన్ని ప్రాంతాల కలిపి ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.218 కోట్ల థియేట్రికల్ బిజినెస్ నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విడుదలకు ముందే ఈ స్థాయి బిజినెస్ జరగడం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు.
‘పెద్ది’ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ‘పెద్ది’ కి భారీ బిజినెస్ జరగడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్గా నిలవాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 400 నుండి రూ. 425 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. రూ.220 కోట్ల నెట్ వసూలు చేయాల్సి ఉంది. ఇక టాక్ మంచిగా ఉండి రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే సూపర్ హిట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ రూ.250 కోట్ల మార్క్‌ను కూడా అందుకోలేకపోతే, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా పరిగణించే అవకాశం ఉంది. ఇలా భారీ బిజినెస్ లెక్కలతో థియేటర్లలోకి వస్తున్న ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
రికార్డు స్థాయి ఓవర్సీస్ డీల్..
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓవర్సీస్ హక్కులు రూ.13 కోట్లకు అమ్ముడవగా, 'పెద్ది' దానికంటే మూడు రెట్లు ఎక్కువ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రామ్ చరణ్‌కు ఉన్న విపరీతమైన ఫ్యాన్ బేస్ ఈ డీల్‌కు ప్రధాన కారణం. విదేశాల్లో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే సుమారు 8 మిలియన్ డాలర్లు అంటే, సుమారు 77కోట్ల వసూళ్లను సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
1980ల నాటి కుస్తీ బరి..!
ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. 1980ల నాటి గ్రామీణ నేపథ్యం, నాటి మనుషుల పంతాలు, పట్టింపులు, ముఖ్యంగా కుస్తీ (రెజ్లింగ్) క్రీడ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ తన శరీరాకృతిని మరింత ఆకట్టుకునేలా మార్చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో ఆయన రస్టిక్ వింటేజ్ లుక్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్ చూసి సెలబ్రిటీలతో పాటు అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, గుండెల్ని పిండేసే బలమైన సెంటిమెంట్ ఈ సినిమాలో హైలైట్ కానుందని టాక్.
ఈ రూరల్ స్పోర్ట్స్ కథలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమ్మన్ ఇరానీ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!
