అయోధ్య రామ మందిరం..చరిత్రలో నిలిచిపోతది : రాష్ట్రపతి ముర్ము

అయోధ్య రామ మందిరం..చరిత్రలో నిలిచిపోతది : రాష్ట్రపతి ముర్ము
  • గొప్ప కట్టడంగా విరాజిల్లుతది: రాష్ట్రపతి ముర్ము
  •     ప్రాణప్రతిష్ఠ వేడుక యావత్ ప్రపంచం చూసింది
  •     రాముడి ఆలయం.. ప్రజల నమ్మకానికి నిదర్శనం
  •     ప్రజాస్వామ్యానికి తల్లి.. ఇండియానే..
  •     కర్పూరి ఠాకూర్​ను భారతరత్నకు ఎంపిక చేయడం అభినందనీయం
  •     75వ రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ :  దేశ నాగరికత, వారసత్వాల పునరావిష్కరణగా.. అయోధ్య రామమందిరం చరిత్రలో గుర్తుండి పోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా.. ఒక గొప్ప కట్టడంగా విరాజిల్లుతుందని చెప్పారు. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘అయోధ్య రామ మందిర వేడుకను యావత్ ప్రపంచం చూసింది. వివాదాస్పద స్థలం విషయమై సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత, సుప్రీం కోర్టు తీర్పు తర్వాతే నిర్మాణం ప్రారంభమైంది. గొప్ప కట్టడంగా చరిత్రలో నిలిచిపోతుంది. రాముడి ఆలయం.. ప్రజల విశ్వాసానికే కాదు.. వారి అపారమైన నమ్మకానికి కూడా నిదర్శనంగా ఉంటుంది’’ అని ద్రౌపది ముర్ము అన్నారు. అదేవిధంగా, భారతరత్న అవార్డుకు ఎంపికైన బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌ గురించి కూడా ఆమె ప్రస్తావించారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన కర్పూరి ఠాకూర్​ను భారతరత్నతో సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఇండియా.. గ్లోబల్ వాయిస్​గా ఆవిర్భవించింది

‘‘జీ20 సమిట్​కు ఇండియా అధ్యక్షత వహించడం అద్భుతం. గ్లోబల్ వాయిస్​గా ఇండియా ఆవిర్భవించింది. వ్యూహాత్మక, దౌత్యపరమైన అంశాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇండియా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నది. ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. ప్రస్తుతం దేశం అమృత కాల ప్రారంభ దశలో ఉంది. ఇండియాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పౌరులకు సువర్ణావకాశం ఉంది’’ అని ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చబడిన ప్రాథమిక విధులకు ప్రజలందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. అదేవిధంగా, వర్ధమాన మహావీర్, సామ్రాట్ అశోకుడు, మహాత్మా గాంధీ బోధనలను ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించారు.

యువతకు అద్భుతమైన అవకాశాలు

మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. రోజువారీ జీవితంలో భాగమవుతున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు.. యువతకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. మూన్ మిషన్, సోలార్ ఎక్స్‌ప్లోరర్ ఆదిత్య ఎల్ 1, మ్యాన్-మిషన్ గగన్‌యాన్, ఇతర సాంకేతిక ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రశంసించారు. ‘‘యువత అభివృద్ధి మార్గంలో ఉన్న అడ్డంకులను మనం తొలగించాలి. వారిలో ఉన్న పూర్తి సామర్థ్యాన్ని బయటికి తీయాలి. యువత సమానత్వం కోరుకుంటున్నది’’ అని ద్రౌపది ముర్ము అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కూడా ఆమె ప్రస్తావించారు.

ఇండియన్ డెమోక్రసీ ఎంతో పురాతనమైంది

పాశ్చాత్య విధానాలతో పోలిస్తే ఇండియన్ డెమోక్రసీ ఎంతో పురాతనమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అందుకే ఇండియాను ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అని పిలుస్తారని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దేశ జీడీపీ వృద్ధి అద్భుతంగా ఉందన్నారు. 2024లో మెరుగైన వృద్ధి సాధిస్తుందని చెప్పారు. కాగా, ఎన్నికల నిర్వహణలో టెక్నాలజీ వాడకం పెరిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.  14వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నదని అన్నారు. 75 ఏండ్లలో 17 సార్లు లోక్​సభ ఎన్నికలు, 400 అసార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిందన్నారు.

ఆయుష్మాన్ భారత్​తో బీమా కవరేజీ

నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ పాలసీ కేంద్రం తీసుకొచ్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆయుష్మాన్ భారత్​తో కోట్లాది మంది ప్రజలకు బీమా కవరేజీ లభిస్తున్నదని తెలిపారు. పేద, బలహీన వర్గాలకు గొప్ప భరోసా ఇస్తున్నదని చెప్పారు. చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని, దేశం లింగ సమానత్వ ఆదర్శం వైపు మరింతగా పురోగమించిందని అన్నారు. నారీ శక్తివందన్ అధినియం మహిళా సాధికాతరకు విప్లవాత్మక సాధనంగా మారుతుందని చెప్పారు.