70,664 ఉద్యోగాలిచ్చాం..రాజకీయ సన్యాసం తీసుకో...కేటీఆర్కు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సవాల్

70,664 ఉద్యోగాలిచ్చాం..రాజకీయ సన్యాసం తీసుకో...కేటీఆర్కు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సవాల్

గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్​ పాలనలో ఇప్పటివరకు 70,664 ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆధారాలతో నిరూపిస్తున్నామని.. మాటకు కట్టుబడి కేటీఆర్​రాజకీయ సన్యాసం తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ సవాల్ ​చేశారు. సోమవారం రామగుండంలో మీడియా సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 70,664 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, అవగాహన లేక మాట్లాడుతున్న కేటీఆర్ ​రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీతో కుమ్మక్కైన బీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పులు కడుతూ, ఉద్యోగులకు జీతాలులిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 

పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ తీరు మారడం లేదని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రామగుండం ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు థర్మల్​ కేంద్రాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, లీడర్లు బొంతల రాజేశ్, దీటి బాలరాజు, కార్పొరేటర్లు, సర్పంచ్​లు తదితరులు పాల్గొన్నారు.