రెండేండ్లలో రామప్ప – లక్నవరం గ్రావిటీ కెనాల్.. పొట్లాపూర్ పనులనూ వెంటనే ప్రారంభించాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రెండేండ్లలో రామప్ప – లక్నవరం గ్రావిటీ కెనాల్.. పొట్లాపూర్ పనులనూ వెంటనే ప్రారంభించాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • అధికారులకు మంత్రుల ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లాలో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు శాశ్వత సాగునీరు అందించేలా చర్యలు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్, పొట్లాపూర్ ప్రాజెక్టుతో పాటు జిల్లాలో కొనసాగుతున్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

శనివారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ములుగు నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణాన్ని రెండేండ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని, వచ్చే వారంలోనే శంకుస్థాపన జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలో అన్ని సాగునీటి ప్రాజెక్టుల పనులను  గడువులో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, ప్రతి ప్రాజెక్టు పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈఎన్‌‌‌‌‌‌‌‌సీని మంత్రులు ఆదేశించారు.  

రైతులు ముందుకు రావట్లే..

రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన భూసేకరణపై అధికారులు సమగ్ర నివేదికను మంత్రులకు సమర్పించారు. కాసిందేవిపేట, ఇంచెర్ల, రామచంద్రాపూర్ గ్రామాల పరిధిలో ఈ ప్రాజెక్టుకు సుమారు 244.23 ఎకరాల భూమి అవసరమవుతుందని తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 201.03 ఎకరాలకు మాత్రమే అవార్డులు జారీ అయినప్పటికీ భూసేకరణ పూర్తికాలేదని వివరించారు.

భూసేకరణకు సంబంధించి 2020-–21లో జారీ చేసిన అవార్డుల ప్రకారం ఎకరాకు రూ.2.47 లక్షల నుంచి రూ.8.26 లక్షల వరకు పరిహారం నిర్ణయించారని, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలు పెరగడంతో ఆ ధరలకు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడంలేదని అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రులు.. రైతుల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగకుండా భూసేకరణ చేపట్టాలని స్పష్టం చేశారు. పాత భూసేకరణ అవార్డును రద్దు చేసి మార్కెట్ విలువల ఆధారంగా కొత్త అంచనాలు రూపొందించి వెంటనే తాజా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.