- దోషులను కాపాడేందుకే కాంగ్రెస్ నిర్లక్ష్యం
- పీసీ ఘోష్ కమిషన్‌పై స్టే.. అంతా సర్కార్ తప్పిదమే: రాంచందర్ రావు
హైదరాబాద్,వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు స్టే ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఈ స్టేను సవాల్ చేస్తూ వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్న వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
బుధవారం బీజేపీ స్టేట్ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన భారీ అవినీతిపై విచారణను ప్రభుత్వం నీరుగారుస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విధివిధానాలు, విచారణా సరళిలో కనీస నిబంధనలు పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడటం చూస్తుంటే.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతోందని అన్నారు. దోషులను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, నిబంధనలు పాటించకుండా విచారణ జరిపి అవినీతిపరులకు లూప్ హోల్స్ దొరికేలా చేసిందని ఆరోపించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు
అధికారంలోకి రాకముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీలిచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆ మాటలు ఎందుకు మర్చిపోయారని రాంచందర్ రావు ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయపోరాటానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
ఆర్టీసీని విలీనం చేయాలని, గుర్తింపు సంఘాల ఎన్నికలు జరపాలన్న డిమాండ్లలో తప్పేముందని రాంచందర్ రావు ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యను పరిష్కరించాల్సింది పోయి, అహంకారంతో నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

