- కార్మికుల తరఫున పోరాటానికి బీజేపీ సిద్ధం: రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మొండివైఖరి వీడి.. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు వారిని చర్చలకు పిలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాంచందర్ రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు భగీరథుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ తీరు బాధాకరమని, సమ్మెపై 41 రోజుల ముందే నోటీసు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులనే ఇప్పుడు కాంగ్రెస్ పునరావృతం చేస్తోందన్నారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు వేస్తోందని, ప్రైవేట్ బస్సులను నడుపుతూ సంస్థను బలహీనపరుస్తోందని ఆరోపించారు.
ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని.. మీ వెనుక బీజేపీ ఉందని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సమ్మెకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. బ్లేమ్ గేమ్‌లు ఆడి కాలయాపన చేయకుండా, కార్మికుల ప్రయోజనాల కోసం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా, ముందుగా భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర సామాజిక వర్గానికి, రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గంగను భువికి తెచ్చిన భగీరథుని కృషి అజరామరమని, ఆయన స్ఫూర్తితోనే సమాజ నిర్మాణంలో సగర సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ నేతలు బూర నర్సయ్య గౌడ్, వీరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

