రాణా కపూర్‌‌కు రూ.7 వేల కోట్లు లాస్‌‌

రాణా కపూర్‌‌కు రూ.7 వేల కోట్లు లాస్‌‌
  • యెస్‌‌ బ్యాంక్‌‌ షేర్ల ధరల పతనమే కారణం
  • మరింత నష్టం ఉండొచ్చన్న ఎనలిస్టులు

న్యూఢిల్లీ: యెస్‌‌ బ్యాంక్‌‌లో సమస్యలు ఈ సంస్థ మాజీ సీఈఓ, వ్యవస్థాపకుడు రాణా కపూర్‌‌ను కలవరపెడుతున్నాయి. గత ఆగస్టు నుంచి ఈ బ్యాంకు షేర్లు పతనమవుతూనే ఉండటంతో ఆయన సంపద రూ.ఏడు వేల కోట్ల వరకు తగ్గిపోయింది. యెస్‌‌ బ్యాంక్‌‌ బుధవారం క్యూ1 ఫలితాలను ప్రకటించింది. క్వాపిటల్ నిల్వలు బాగా తగ్గాయని, మొండిబకాయిలు భారీగా పెరిగాయని వెల్లడించింది.  మరునాడు షేరు 20 శాతం పడిపోయింది. ఫలితంగా కపూర్‌‌ నెట్‌‌వర్త్‌‌ 1.4 బిలియన్‌‌ డాలర్ల నుంచి 377 మిలియన్‌‌ డాలర్లకు పడిపోయిందని బ్లూమ్‌‌బర్గ్‌‌ బిలియనీర్స్‌‌ ఇండెక్స్‌‌ వెల్లడించింది. మొండిబకాయిల వివాదాల కారణంగా సెంట్రల్ బ్యాంక్‌‌ నుంచి వైదొలిగిన కపూర్‌‌, 2004లో కొందరితో కలిసి యెస్‌‌ బ్యాంక్‌‌ను స్థాపించారు. గతంలో డాయిష్‌‌ బ్యాంకులో పనిచేసిన రవ్‌‌నీత్‌‌ గిల్ రాణా కపూర్‌‌ తరువాత సీఈఓగా బాధ్యతలు చేట్టారు. ఎన్‌‌బీఎఫ్‌‌సీల సంక్షోభం వల్ల యెస్‌‌ బ్యాంక్‌‌కు కలిగిన నష్టాలను భర్తీ చేయలేక ఈయన సతమతమవుతున్నారు. ఎన్‌‌బీఎఫ్‌‌సీ కంపెనీలకు యెస్‌‌ బ్యాంక్‌‌ పెద్ద ఎత్తున లోన్లు ఇవ్వడమే ఇందుకు కారణం.

మరింత పతనం తప్పదా ?

కపూర్‌‌ తన హోల్డింగ్‌‌ కంపెనీలు యెస్‌‌ క్యాపిటల్‌‌, మార్గన్‌‌ క్రెడిట్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ ద్వారా యెస్‌‌ బ్యాంక్‌‌లో 10 శాతం వాటాలు కొన్నారు. వీటిని   తన ముగ్గురు కూతుళ్లకు బదిలీ చేస్తానని కొంతకాలం క్రితం ప్రకటించారు. షేర్ల ధరల పతనంపై స్పందించడానికి కపూర్‌‌ తిరస్కరించారు. యెస్‌‌ బ్యాంక్‌‌ భవిష్యత్‌‌ గురించి కొత్త ఎనలిస్టులు వెలువరించిన అంచనాలు నిజమైతే, ఈ కంపెనీ ఆస్తుల విలువ మరింత పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, యెస్​ బ్యాంక్​ షేరు గురువారం కూడా 12 శాతానికి పైగా నష్టపోయి బిగ్గెస్ట్​ లూజర్​గా నిలిచింది.