ప్రభుత్వ భూముల కబ్జాలో రంగారెడ్డి జిల్లా టాప్

ప్రభుత్వ భూముల కబ్జాలో రంగారెడ్డి జిల్లా టాప్

రంగారెడ్డి జిల్లాలో భూ కబ్జాల పర్వం పరాకాష్టకు చేరింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో చూస్తే ఈ జిల్లానే భూ అక్రమాల్లో ఫస్ట్​ ప్లేస్​లో ఉంది. ఎక్కడ చూసినా ఎకరం కోట్లు పలుకుతుండడంతో అక్రమార్కులు ప్రభుత్వానికి సంబంధించిన ఏ భూమిని వదలట్లేదు.  ఇక్కడ మొత్తం 2.16 లక్షల ఎకరాల్లో వివిధ రకాల ప్రభుత్వ భూములు ఉండగా, 90,967 ఎకరాల్లో అసైన్డ్ భూమి ఉంది. ఈ జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట  భూకబ్జా వెలుగుచూస్తోంది. 

తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములను ప్రైవేట్​ పట్టా భూములుగా మార్చేసుకోవడం పరిపాటిగా మారింది. మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో  భూదాన్ భూముల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. 

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 23 వేల 542 ఎకరాల భూదాన్ భూమి ఉండగా, అందులో ఏకంగా 7 వేల ఎకరాలకు పైగా వివాదాల్లో చిక్కుకుంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో పేదలకు చెందాల్సిన భూములను బడా రియల్టర్లు  వెంచర్లుగా మార్చేశారు. మహేశ్వరం పరిధిలోని ఒక కీలక సర్వే నంబర్‌లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ సంస్థ తన సొంత భూమిగా క్లెయిమ్ చేస్తూ కోర్టులో కేసు వేసింది.

►ALSO READ | ఇద్దరూ మైనర్లే.. ఇన్స్టాగ్రామ్ లో లైంగిక వేధింపులు..బాలిక ఆత్మహత్య..

స్టే ఆర్డర్ ఉండగానే అక్కడ భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారుల అండదండలతో ‘ప్రోహిబిటెడ్ లిస్ట్’ (22ఏ) నుంచి భూమిని తొలగించి క్రయవిక్రయాలు సాగించడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని 162, 163, 165   సర్వే నంబర్లలో సుమారు 450 ఎకరాల భూదాన్ భూమి ఉంది. వినోభాభావే పాదయాత్ర సమయంలో దానం చేసిన ఈ భూములను పేదలకు పంచాల్సి ఉండగా, కొందరు స్థానిక నాయకులు, రియల్టర్లు కుమ్మక్కై నకిలీ వారసులను తెరపైకి తెచ్చారు.  భూదాన్ బోర్డు నుంచి ఎన్ఓసీలు , ఇతర  రికార్డులు సృష్టించి, ఏకంగా వెంచర్లుగా మార్చి విక్రయించారు. ప్రస్తుతం ఇక్కడ కోట్లాది రూపాయల విలువైన విల్లాలు వెలిశాయి. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ఇది భూదాన్ భూమిగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉంది.