శ్రీలంకకు నూతన ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘె 

శ్రీలంకకు నూతన ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘె 
  • రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ దేశ అధ్యక్షుడు కీలక నిర్ణయం
  • గతంలో నాలుగుసార్లు శ్రీలంక ప్రధానమంత్రిగా చేసిన అనుభవం
  • విక్రమసింఘెను ప్రధానిగా ఎన్నుకునేందుకు మద్దతు నిలిచిన విపక్షాలు
  • కొత్త ప్రధాని రణిల్‌ విక్రమసింఘె ముందు అనేక సవాళ్లు
  • ప్రస్తుతం నేవల్​ బేస్ లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని మహింద రాజపక్స
  • మహింద రాజపక్సతో పాటు ఆయన అనుచరగణం విదేశాలకు వెళ్లకుండా బ్యాన్

కొలంబో: శ్రీలంకకు నూతన ప్రధానమంత్రిగా రణిల్‌ విక్రమసింఘె(73) ఎంపికయ్యారు. శ్రీలంకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ ఆ దేశ అధ్యక్షుడు గోటబయా రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రధాని మహింద రాజపక్స స్థానంలో యూఎన్​పీ పార్టీ అధ్యక్షుడు, మాజీ పీఎం రణిల్​ విక్రమ సింఘెకు ప్రధానిగా బాధ్యతలు అప్పగించారు.

అసలు రణిల్‌ విక్రమసింఘె ఎవరు..?

శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులుండగా.. ఒకే ఒక్క సభ్యుడున్న యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ యూఎన్​పీ అధ్యక్షుడిగా విక్రమసింఘె ఉన్నారు. విక్రమసింఘె గతంలో నాలుగుసార్లు శ్రీలంక ప్రధానమంత్రిగా పని చేశారు. శ్రీలంకలో అధికార పార్టీతో పాటు పలు విపక్షాలు కూడా విక్రమ సింఘెను ప్రధానిగా ఎన్నుకునేందుకు మద్దతు తెలిపాయి. 

ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంపై నిరసనలు వెల్లువెత్తుతుండడం వల్ల ఉద్రిక్త పరిస్థితులను కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే తాజాగా ప్రజలకు ఊరట కల్పిస్తూ ఆంక్షలను సడలిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స కొన్ని గంటల పాటు కర్ఫ్యూను ఎత్తివేసి ప్రజలు రోడ్లపై తిరగడానికి అనుమతించేలా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నేవల్​ బేస్ లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని మహింద రాజపక్స సహా శ్రీలంక పొదుజన పెరుమున పార్టీకి చెందిన మరో 12 మంది నేతలపై ఆంక్షలు విధించారు. విదేశాలకు పారిపోకుండా వారిపై ట్రావెల్​ బ్యాన్ విధించారు.

రణిల్‌ విక్రమసింఘె ముందు అనేక సవాళ్లు..
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నూతన ప్రధాన మంత్రిగా ఎన్నికైన రణిల్‌ విక్రమసింఘె ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ముందుగా వాటన్నింటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. రాజకీయ సంక్షోభానికి తెరదించి..ప్రజల కష్టాలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చుక్కలనంటిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం దేశంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది. 

ప్రస్తుతం శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం వీలైనంత త్వరగా తొలగిపోవాలంటే ఎంతో అనుభవం ఉన్న విక్రమసింఘే లాంటి వాళ్లు అవసరమని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. విక్రమసింఘే ప్రధాని అయితే దేశంలో ఆందోళనలు, నిరసనలు కొంతైనా తగ్గుముఖం పట్టొచ్చని అధ్యక్షుడు గోటబయా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

స్టడీ సర్టిఫికెట్ల కోసం గ్రూప్-1 అభ్యర్థుల తిప్పలు

ఎయిరిండియా కొత్త సీఈఓగా క్యాంబెల్ విల్సన్