టీమిండియా కొంపముంచిన మిస్ ఫీల్డ్.. ఒక్క పొరపాటుతో మ్యాచ్ స్వరూపమే మారిపోయిందిగా..!

టీమిండియా కొంపముంచిన మిస్ ఫీల్డ్.. ఒక్క పొరపాటుతో మ్యాచ్ స్వరూపమే మారిపోయిందిగా..!

బ్రిటన్: మాంచెస్టర్‎లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్డేడియం వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్ట్‎లో మిస్ ఫీల్డింగ్ టీమిండియా కొంపముంచింది. ఒక్క పొరపాటు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. మాంచెస్టర్ టెస్టులో సెంచరీతో ఇంగ్లాండ్‎ను పటిష్ట స్థితిలో నిలిపిన జో రూట్ రనౌట్ మిస్ చేసి భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 54వ ఓవర్లో మొహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని రూట్ గల్లీ వైపు షాట్ ఆడాడు. వెంటనే బంతిని అందుకున్న జడేజా వికెట్లకు త్రో విసిరాడు. కానీ జడేజా విసిరిన త్రో డైరెక్ట్ వికెట్లకు తాకలేదు. అయితే, జడేజా విసిరిన త్రోను వికెట్ల దగ్గర పట్టుకునేందుకు ఎవరూ లేరు. అప్పటికీ ఇంకా రూట్ క్రీజులోకి రాలేదు. 

ఒకవేళ వేరే ఫీల్డర్ జడేజా విసిరిన త్రోను వికెట్ల దగ్గర పట్టుకుంటే రూట్ రనౌట్ అయ్యాడు. కానీ దురదృష్టవశాత్తూ వికెట్ల దగ్గర ఎవరూ లేకపోవడం, జడేజా విసిరిన త్రో డైరెక్ట్ హిట్ కాకపోవడంతో రూట్ బతికిపోయాడు. అయితే, మిడ్-ఆన్‎లో ఫీల్డింగ్ చేస్తున్న అన్షుల్ కాంబోజ్ జడేజా విసిరిన త్రోను వికెట్ల దగ్గర కవర్ చేయాల్సింది. కానీ అతడు వేగంగా వికెట్ల దగ్గరకు రాలేకపోయాడు. దీంతో జడేజా తీవ్ర అసహనానికి గురయ్యాడు. వికెట్ల దగ్గరకు రావాలి కదా అన్నట్లుగా అన్షుల్ కాంబోజ్ వైపు చూస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఈ రనౌట్ మిస్ అయినప్పుడు రూట్ 22 పరుగులు మాత్రమే చేశాడు. ఈ లైఫ్ లైన్ సద్వినియోగం చేసుకున్న రూట్ భారీ సెంచరీ చేశాడు. రూట్ అద్భుత సెంచరీతో నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఒకవేళ రూట్ రనౌట్ అయ్యింటే ఇంగ్లాండ్ పరిస్థితి కాస్త వేరేలా ఉండేదంటున్నారు. మొత్తానికి టీమిండియా చేసిన ఒక్క మిస్టేక్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది.