లీడర్ల భూముల కోసం రూట్​ తప్పిన మెట్రో..ప్రజలపై 2వేల కోట్ల భారం

లీడర్ల భూముల కోసం రూట్​ తప్పిన మెట్రో..ప్రజలపై 2వేల కోట్ల భారం
  • ఫలక్‌‌నుమా బదులు రాయదుర్గం నుంచి ఎయిర్​పోర్ట్​కు ఫేజ్–2​ 
  • ప్రజలపై అదనంగా రూ. 2 వేల కోట్లకుపైగా భారం
  • ఫలక్​నుమా టు ఎయిర్​పోర్ట్​ వరకు గతంలోనే పూర్తయిన సర్వే
  • ఈ రూట్​లో డిస్టెన్స్​ తక్కువే.. నిర్మాణ ఖర్చూ తక్కువే
  • రాయదుర్గం - ఎయిర్​పోర్ట్​కు 31 కి.మీ.లు.. ఫలక్​నుమా - ఎయిర్​పోర్ట్​కు 16.6 కి.మీ.లే
  • అయినా రాయదుర్గం మీదుగా వేయాలని సర్కారు నిర్ణయం.. రేపు సీఎం శంకుస్థాపన
  • రియల్​ దందా, నేతలకు లాభం చేయడానికే కొత్త రూట్​!

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్‌‌ మెట్రో రైల్‌‌ ప్రాజెక్టు సెకండ్​ ఫేజ్​ రూట్​ తప్పింది. ప్రజలపై భారం తగ్గించే లాభసాటి దారిలో కాకుండా రాయదుర్గం నుంచి కొత్త లైన్‌‌ నిర్మాణానికి రాష్ట్ర సర్కార్​ పూనుకుంది. తమ అనుయాయులు, లీడర్ల రియల్‌‌ ఎస్టేట్‌‌ దందా కోసమే ఈ మార్పును ప్రభుత్వం చేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఫలక్​నుమా నుంచి ఎయిర్​పోర్టు వరకు మెట్రో నిర్మించాలని గతంలో సర్వే కూడా చేశారు. ఈ రూట్​లో మెట్రో వల్ల దూరం తగ్గుతుంది.. పైగా నిర్మాణ ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ, దీన్ని కాదని ప్రభుత్వం రాయదుర్గం నుంచి ఎయిర్​పోర్ట్​కు మెట్రో రూట్​ను షిఫ్ట్​ చేసింది. ఈ కొత్త రూట్​లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 6,250 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. అదే ఫలక్​నుమా నుంచి చేపడితే రూ. 4వేల కోట్ల వరకు అవుతుంది. అంటే దాదాపు రెండు వేల కోట్ల భారం తగ్గుతుంది. అదేవిధంగా ఎల్బీనగర్​ నుంచి ఎయిర్​పోర్ట్​కు కనెక్టివిటీ చేసినా ఖర్చు తగ్గుతుంది. కానీ.. ప్రభుత్వం రాయదుర్గం రూట్​నే ఎంచుకోవడం, కేంద్రంతో పనిలేకుండా తామే చేపడ్తామని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త రూట్​ పొడవునా టీఆర్​ఎస్​ లీడర్ల, సన్నిహితుల భూములు ఉన్నాయి. పైగా మొన్నటి వరకు 111 జీవో పరిధిలో ఈ భూములు ఉండేవి. ఇప్పుడు జీవోలోని ఆంక్షలను కూడా ఎత్తేసింది. ఫలితంగా అక్కడ భూములకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు మెట్రో వల్ల ఆ ఏరియాలో భూముల ధరలు పదింతలు కానున్నాయి. సెకండ్​ ఫేజ్​ పనులకు శుక్రవారం సీఎం కేసీఆర్​ శంకుస్థాపన చేయనున్నారు.

రూట్​ ఇదే... వాళ్ల ల్యాండ్స్​ అక్కడే

ల్యాండ్స్​ ధరలను అమాంతం పెంచుకుని రియల్​ బూమ్​తో సొమ్ము చేసుకోవాలనే ప్లాన్​లో భాగంగానే కొత్త మెట్రో రూట్​ ఆగమేఘాల మీద పట్టాలు ఎక్కుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాయదుర్గంలో ఎస్​ఎఫ్​టీ మొన్నటి దాకా రూ.10 వేలు ఉంటే ఇప్పుడు రూ.14 వేలకు ఎగబాకింది. నానక్​రాంగూడలో ఏరియాను బట్టి ఎకరం రూ.50 కోట్ల నుంచి రూ.75 కోట్లు ఉంటే ఇప్పుడు ఇది రూ.100 కోట్లు దాటుతున్నది. రాజేంద్రనగర్​ రోడ్డు, టీఎస్​పీఏ జంక్షన్​   ఏరియాలో మినిమమ్​ ఎకరా రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఉంటే.. ఈ నెల కాలంలోనే 60 కోట్లు దాటింది. మెట్రో ప్రాజెక్ట్​ పూర్తయితే ఈ రేట్లు పెరుగుతాయి. రాయదుర్గం నుంచి ఎయిర్​పోర్ట్​ వరకు చేపట్టనున్న  మెట్రో కారిడార్​లో ఎయిర్​పోర్ట్​ సమీపంలో 2.5 కి. మీ. అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. ఈ కారిడర్​లో  మైండ్ స్పేస్ (రాయదుర్గం),  బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, ఓఆర్ఆర్  నానక్ రాంగూడ, నార్సింగి, టీఎస్​పీఏ, హిమాయత్ సాగర్ , రాజేంద్రనగర్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్టు కార్గో, టెర్మినల్​ స్టేషన్లు ఉండేలా ప్లాన్​ చేస్తున్నారు.  రూట్​లో భూములన్నీ 111 జీవో పరిధిలో ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతాల్లోని ఎక్కువ మొత్తంలో ల్యాండ్స్​ కొనుగోలు చేసింది కూడా అధికార పార్టీలోని వాళ్లేననే విమర్శలు ఉన్నాయి. అందువల్లే జీవో 111లో ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్​లో ప్రభుత్వం  69 జీవో ఇచ్చింది. దీనిపై క్లారిటీ రాకముందు కొత్త రూట్​ను సర్కార్​ ఎంపిక చేసింది. ప్రభుత్వ పెద్దలకు చెందిన వేల ఎకరాల భూములకు లబ్ధి చేసేలా ప్లాన్​ను అమలు చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఓల్డ్​ సిటీ వరకు ముందుకు పడలే.. 

మెట్రోను ఎయిర్​పోర్ట్​ వరకు విస్తరించాలనే డిమాండ్  చాలా కాలం నుంచే ఉన్నది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన రాయదుర్గం–ఎయిర్​పోర్ట్​ రూట్​ 31 కిలోమీటర్లు ఉన్నది. మరో రెండు రూట్లలోనూ ఎయిర్​పోర్ట్​కు మెట్రో విస్తరించే ప్లాన్లు గతంలోనే రెడీ చేశాయి. అందులో ఫలక్​నుమా నుంచి ఎయిర్​ పోర్ట్​ అనే ప్రపోజల్​కు సర్వే పూర్తి చేశారు. ఫలక్​నుమా నుంచి ఎయిర్​ పోర్ట్​ వరకు దూరం 16.6 కిలోమీటర్లు వస్తుంది. అంటే.. 14.4 కిలోమీటర్ల డిస్టెన్స్​ తగ్గుతుంది. జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు చేపట్టాల్సిన 15 కి.మీ.పనుల్లో ఎంజీబీఎస్‌ వరకు పూర్తయ్యాయి. ఎంజీబీఎస్​ నుంచి ఫలక్​నుమా వరకు 5.5 కిలోమీటర్ల పనులు పెండింగ్​లో ఉన్నాయి. దీనికి గతేడాది, ఈసారి కలిపి బడ్జెట్​లో రూ.1,300 కోట్లు కేటాయించినా రూపాయీ రిలీజ్​ చేయలేదు. ఇది పూర్తి చేసి.. ఫలక్​నుమా నుంచి ఎయిర్​పోర్ట్​కు మెట్రో చేపడితే ఖర్చు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎల్బీ నగర్​ నుంచి ఎయిర్​పోర్ట్​కు ప్రాజెక్ట్​ చేపడితే ఆ దూరం  23  కిలో మీటర్ల ఉంటుంది. రాయదుర్గంతో చూస్తే ఇది 8 కిలో మీటర్లు తక్కువ. నిర్మాణ ఖర్చు కూడా తక్కువే. పైగా రాయదుర్గం నుంచి నేరుగా ఎయిర్​పోర్ట్​ వరకు ఏడాదికి లక్ష మంది వరకే ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన నెలకు దాదాపు 8,500  మంది..రోజుకు దాదాపు 300 మంది మాత్రమే కొత్త రూట్​లో ప్రయాణిస్తారు.

నచ్చిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టుడే!

ప్రస్తుతం మెట్రో నిర్మించాలంటే కిలో మీటర్‌‌‌‌కు రూ.250  కోట్లు ఖర్చవుతుంది.  రాయదుర్గం–ఎయిర్​పోర్ట్​ రూట్​ ఖర్చు రూ.6 వేల కోట్లు దాటుతున్నది. దూరం పెరగడంతోనే ఇంత మేర వ్యయం అవుతున్నది. అదే ఫలక్​నుమా, ఎల్బీ నగర్​లో  ఏ రూట్​ నుంచి మొదలు పెట్టినా సగం కంటే తక్కువ ఖర్చు అవడమే కాకుండా దూరం కూడా తగ్గుతుంది. కాంట్రాక్టు ఏజెన్సీలను నియమించేందుకు ఎయిర్‌‌పోర్ట్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ మెట్రో లిమిటెడ్‌‌ (హెచ్‌‌ఏఎంఎల్‌‌) ఇప్పటికే ఎక్స్‌‌ప్రెషన్‌‌ ఆఫ్‌‌  ఇంట్రెస్ట్‌‌(ఈవోఐ) ప్రభుత్వం ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 13 చివరి తేదీగా నిర్ణయించారు. ప్రస్తుత మెట్రో కారిడార్లను ఎల్​అండ్​ టీ నిర్మించింది. ఈ సంస్థ ఇప్పుడు నష్టాల్లో ఉంది. దీంతో ఎల్​ అండ్​టీ ముందుకు వస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎల్​అండ్​టీ కాకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిన కంపెనీలకు కొత్త మెట్రో కారిడార్​ను కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ ఎల్​ అండ్​టీకి ఇచ్చినా.. సబ్​ కాంట్రాక్ట్​ల పేరుతోనూ తమవారికే అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిసింది.

రిపోర్ట్​ లేదాయె.. అప్పే దిక్కాయె

మెట్రో రైల్​ ప్రాజెక్ట్​ డీపీఆర్​లో కొన్ని అంశాలు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఇందులో టెక్నికల్ రిపోర్ట్, ఫీజిబిలిటీ రిపోర్ట్ , ఎకనామిక్​ అండ్​ సోషల్​ కాస్ట్​ బెనిఫిట్స్​, ఫైనాన్షియల్​ అనాలసిస్​, సోషల్​ వయబిలిటీ వంటివి ఉంటాయి. వీటి వివరాలేవీ పూర్తిగా చెప్పకుండానే రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెట్రో కారిడర్​కు శంకుస్థాపన చేస్తున్నది. పైగా ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోరితే.. అడిగిన  అన్ని రిపోర్టులు ఇవ్వాల్సి వస్తుందని, ఎక్కడి నుంచి ఎయిర్​పోర్ట్​ కనెక్టివిటీ ఉంటే బాగుంటుందనే ప్రతిపాదన కూడా వస్తుందన్న ఉద్దేశంతోనే రాష్ట్ర సర్కారు సొంత రూట్​లో వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌‌ఎండీఏ, హెచ్‌‌ఎంఆర్‌‌ఎల్‌‌, టీఎస్‌‌ఐఐసీ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టుకు నిధులు సర్దుబాటు చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దీంతో అప్పులు తెచ్చే ఈ ప్రాజెక్ట్​ను పూర్తి చేయనున్నారు. ఆ రూట్​లో ప్రయాణించే ప్యాసింజర్ల నుంచి వసూలు చేసి కడుతామనే కన్సెంట్, సర్కార్​ గ్యారంటీతో అప్పులు తీసుకోనున్నట్లు తెలిసింది.