కష్టాల్లో ఉన్న కేంద్రానికి బిగ్ రిలీఫ్.. రికార్డ్ స్థాయిలో రూ. 2లక్షల 87వేల కోట్లు డివిడెండ్ చెల్లించిన RBI

కష్టాల్లో ఉన్న కేంద్రానికి బిగ్ రిలీఫ్.. రికార్డ్ స్థాయిలో రూ. 2లక్షల 87వేల కోట్లు డివిడెండ్ చెల్లించిన RBI

ఆర్థిక కష్టాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఊరటనిచ్చింది. చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఏకంగా రూ. 2లక్షల 86వేల 588.46 కోట్ల రికార్డ్ మిగులు నిధులను డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఆర్‌బీఐ బోర్డ్ ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఇచ్చిన రూ.2లక్షల 69వేల కోట్ల రికార్డే ఇప్పటివరకు అత్యధికం కాగా.. ఈ ఏడాది ఆర్బీఐ తన పాత రికార్డును బద్దలుకొట్టేసింది.

ఎలా సాధ్యమైంది?
గడిచిన ఏడాదిలో ఆర్‌బీఐ స్థూల ఆదాయం 26.42 శాతం మేర పెరగడం వల్లే ఈ స్థాయిలో కేంద్రానికి నిధులు ఇవ్వడం సాధ్యపడింది. నిజానికి ఆర్‌బీఐ.. ఇతర జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం రూ.3.16 లక్షల కోట్ల డివిడెండ్‌ను బడ్జెట్‌లో ఆశించగా.. కేవలం ఆర్‌బీఐ నుంచే సింహభాగం నిధులు రావటం ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి రిలీఫ్ గా మారనుంది. 

సంక్షోభంలో బిగ్ రిలీఫ్..
ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం, గల్ఫ్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్, ఎరువులు, ఇతర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి, విదేశీ ఇన్వెస్టర్లు రికార్డ్ స్థాయిలో స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల తీవ్రమైన ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న కేంద్రానికి రిజర్వు బ్యాంక్ చెల్లిస్తున్న రూ.2లక్షల 87వేల కోట్లు చాలా పెద్ద రిలీఫ్ ఇవ్వనున్నాయి.

ALSO READ : రాజకీయాల కంటే దేశమే ముఖ్యం.. 

ఇప్పటికే ఆర్థిక పరిస్థితిని మేనేజ్ చేయడానికి బంగారం, వెండిపై కేంద్రం దిగుమతి సుంకాలను 6% నుండి ఏకంగా 15%కి పెంచింది. అలాగే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఫెమా రూల్స్ కూడా సడలించే యోచనలో ఉంది. ఇలాంటి గడ్డు కాలంలో ఆర్‌బీఐ ఇచ్చిన ఈ బంపర్ డివిడెండ్ ప్రభుత్వానికి 'సంజీవని' లాంటిదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.