రియల్ ఎస్టేట్ రంగం: బిల్డర్ల మోసాలపై సుప్రీం ఫైర్

రియల్ ఎస్టేట్ రంగం: బిల్డర్ల మోసాలపై సుప్రీం ఫైర్

‘‘రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ రంగంలో ఎంత అవినీతి జరుగుతుందో మాకు తెల్సు. బిల్డర్ల నుంచి అధికారులు ఎంతెంత పుచ్చుకుంటున్నారో, రూల్స్‌‌‌‌‌‌‌‌ను ఎలా తుంగలోకి తొక్కుతున్నారో తెల్సు. జనాన్ని దారుణంగా మోసం చేస్తున్నారు. ఇంతటి అవినీతి ఇండియాలో తప్ప మరే దేశంలో జరగదు. అయినా అవినీతికి మనం ఉరిశిక్ష వేయలేం’’ అంటూ సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అవినీతి అధికారులు, బ్యాంకుల సాయంతో రియల్టర్లు దేశవ్యాప్తంగా లక్షల మందిని ముంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది.

బిల్డర్లు రూల్స్‌‌‌‌‌‌‌‌ను గాలికొదిలి రోడ్ల వెంట ఆకాశాన్ని తాకే బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లు కడుతున్నా పట్టించుకోని నోయిడా, గ్రేటర్‌‌‌‌‌‌‌‌ నోయిడా అధికారులు, బ్యాంకులకు మొట్టికాయలు వేసింది. ఆమ్రపాలి రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ నుంచి 42 వేల ఫ్లాట్లు కొన్నా తమకు వాటిని అప్పగించడం లేదంటూ బాధితులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ అరుణ్‌‌‌‌‌‌‌‌ మిశ్రా, జస్టిస్‌‌‌‌‌‌‌‌ యు.యు.లలిత్‌‌‌‌‌‌‌‌లతో కూడిన బెంచ్‌‌‌‌‌‌‌‌ బుధవారం విచారణ జరిపింది. అధికారులు ముందే కళ్లు తెరిచి ఉంటే జనాలు మోసపోయేవారు కాదని పేర్కొంది. ఈ సందర్భంగా బిల్డర్లు, డెవలపర్ల ఆగడాలను అరికట్టేందుకు రూల్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయని గ్రేటర్‌‌‌‌‌‌‌‌ నోయిడా తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ అన్నారు.

భూమిని లీజ్‌‌‌‌‌‌‌‌కు తీసుకున్న బిల్డర్‌‌‌‌‌‌‌‌ ఒకవేళ రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించకుంటే మొదట నోటీసులు జారీ చేస్తామని, అయినా వినకుంటే లీజ్‌‌‌‌‌‌‌‌ రద్దు చేస్తామని కోర్టుకు చెప్పారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బిల్డర్లు, అధికారుల అవినీతి అంతా తమకు తెలుసంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇప్పటిదాకా నోయిడా అధికారులు ఇలా ఎన్ని లీజులు రద్దు చేశారో చెప్పాలని ప్రశ్నించింది. ఒక్క నోయిడాలోనే కాదు.. ఇండోర్‌‌‌‌‌‌‌‌, భోపాల్‌‌‌‌‌‌‌‌, ఇతర సిటీల్లో కూడా బ్యాంకులు, అవినీతి అధికారులతో చేతులు కలిపి బిల్డర్లు పక్కపక్కనే ఎత్తైన బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లు కడుతున్నారని, అయితే తగిన సర్టిఫికెట్లు లేక అవి అమ్ముడుపోవడం లేదని తెలిపింది.

‘‘పదేళ్ల నుంచి మీరు(అధికారులు) ఏం చేయలేదు. కళ్లు మూసుకున్నారంతే. బిల్డర్లు, మీరంతా ఒక్కటే. చివరికి నష్టపోయేది జనమే’’ అని బెంచ్‌‌‌‌‌‌‌‌ కామెంట్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఆమ్రపాలి గ్రూప్‌‌‌‌‌‌‌‌ నుంచి ఫ్లాట్లు కొని మోసపోయామంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. ఫిబ్రవరి 28న ఆ గ్రూప్‌‌‌‌‌‌‌‌ సీఎండీ, అనిల్‌‌‌‌‌‌‌‌ శర్మ, ఇద్దరు డైరెక్టర్లను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులకు అనుమతిచ్చింది. వారి వ్యక్తిగత ఆస్తులను కూడా సీజ్‌‌‌‌‌‌‌‌ చేసింది.