తెల్లవారుజామునే తాతయ్య సంజీవయ్య తన మనవడు కౌశల్‌ను వెంటబెట్టుకుని పొలానికి బయలుదేరాడు. పచ్చని పైర్లు, పక్షుల కిలకిలరావాల మధ్య నడుస్తుంటే కౌశల్‌కు ఎంతో ఉత్సాహంగా అనిపించింది. వారు ఊరి వీధి గుండా వెళ్తుండగా, రాజవ్వ ఇంటి ముందు పెద్దగా మాటలు వినిపించాయి. రాజవ్వ తన భర్త రంగయ్యను నిలదీస్తూ, ‘‘ఆ ఆకతాయికి అంత డబ్బు చేతికి ఇచ్చావే.. వాడు దాన్ని జల్సాలకు తగలేశాడు. నువ్వు చేసిన సాయం కాస్తా ‘ఏటిలో కలిపిన చింతపండు’లా అయిపోయింది తెలుసా!’’ అని బాధతో చెప్తోంది.
ఆ మాట వినగానే కౌశల్ అయోమయంగా చూశాడు. ‘‘తాతయ్యా.. ఏటిలో చింతపండు కలపడం ఏంటి?’’ అని అడగబోయాడు. కానీ తాతయ్య నవ్వుతూ ‘‘ముందు పొలానికి వెళ్దాం పద, అక్కడ నిమ్మళంగా చెప్తాను’’ అని ముందుకు సాగాడు.
మరికొంత దూరం వెళ్లాక మధురమ్మ తన కొడుకును విసుక్కుంటూ కనిపించింది. ‘‘నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారదు. నిన్ను ప్రయోజకుడిని చేయాలని నేను పడుతున్న తాపత్రయం అంతా ‘‘ఏటిలో కలిపిన చింతపండు చందాన తయారైంది’’ అని అరుస్తోంది.
కౌశల్‌కు ఆ జాతీయం మీద కుతూహలం మరింత పెరిగింది. ఎప్పుడెప్పుడు పొలం చేరుకుంటామా? ఎప్పుడు తాతయ్యను అడుగుదామా? అని ఆత్రుతగా నడవసాగాడు.పొలానికి చేరుకోగానే బావి గట్టు మీద ఉన్న వేపచెట్టు నీడలో కూర్చుని, ‘‘తాతయ్యా! అందరూ ఆ చింతపండు జాతీయాన్నే వాడుతున్నారు. అసలు ఏటిలో చింతపండు కలిపితే ఏమవుతుంది? దాని అర్థం ఏంటి?’’ అని అడిగాడు.
సంజీవయ్య మనవడిని దగ్గరకు తీసుకుని శాంతంగా వివరించడం మొదలుపెట్టాడు. ‘‘చూడు కౌశల్! మనం ఇంట్లో పప్పు చారు వండుకున్నప్పుడు చింతపండు వేస్తే అది వంటకు రుచినిస్తుంది. కానీ అదే చింతపండును పారే ఏటి నీళ్లలో కలిపితే ఏమవుతుంది? ఆ ప్రవాహంలో అది కలిసిపోయి మాయమైపోతుంది. ఏటి నీళ్లు పుల్లబడవు.. అటు ఆ చింతపండు మనకు తిరిగి దొరకదు. అంటే అక్కడ మనం చేసిన పని వల్ల ఎలాంటి ఫలితం లేదని, అది పూర్తిగా వృథా అయిపోయిందని అర్థం”అన్నాడు.
తాతయ్య మాటలను శ్రద్ధగా వింటున్న కౌశల్ ఇంకాస్త వివరంగా చెప్పమన్నాడు. అందుకు ఆయన ఇంకా విడమర్చి చెప్పాడు. ‘‘రాజవ్వ భర్త చేసిన సాయం దుర్వినియోగం అయ్యింది కాబట్టి ఆమె అలా అంది. అంటే ఆమె చేసిన సాయం వల్ల ఏ ప్రయోజనమూ లేకపోయింది. అలాగే మధురమ్మ తన కొడుకును మార్చడానికి చేసిన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయ్యాయి.
ఏదైనా ఒక వస్తువును గానీ, శ్రమను గానీ, కాలాన్ని గానీ సరైన పద్ధతిలో వాడకపోతే అది ‘ఏటిలో కలిపిన చింతపండు’లాగే వృథా అవుతుంది. అందుకే మనం చేసే ఏ పనైనా ఫలితాన్ని ఇచ్చేదిగా ఉండాలి’’ అని ముగించాడు. ఆ వివరణతో ఆ జాతీయం పరమార్థం కౌశల్‌కు పూర్తిగా బోధపడింది. తన కాలాన్ని, విద్యను ఎప్పుడూ అలా వృథా చేయనని తాతయ్యకు మాట ఇచ్చాడు కౌశల్.
- డా. పోతగాని సత్యనారాయణ -
