గద్వాల, వెలుగు : రాజకీయ కక్షతోనే తన భద్రతను తగ్గించారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీసులో సోమవారం మీడియాతో మాట్లాడారు. తాను 26 ఏండ్లు ఐపీఎస్ అధికారిగా పనిచేశానని, రాష్ట్రపతి శౌర్య పతకం కూడా వచ్చిందని గుర్తు చేశారు. నిత్యం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే భద్రతను తగ్గించిందని, అయినా భయపడేది లేదని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు.
తనకు ఏదైనా జరిగితే రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ గురుకుల పాఠశాలలో జరుగుతున్న కుంభకోణాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. గద్వాల నియోజకవర్గంలో నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరగాపూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్ చార్జి హనుమంతు నాయుడు, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.
