- టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, వెలుగు: సమాజంలో మార్పు రావాలంటే సమగ్ర సంస్కరణలు అవసరమని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు. ‘ఆర్థిక సంస్కరణలు, భారత రాజ్యాంగం: విభేదాలు, భవిష్యత్ దిశ’ అనే అంశంపై అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజ అభివృద్ధిలో విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు చట్టాలు, రాజ్యాంగంపై అవగాహన లేకపోవడంతో సంస్కరణల అమలులో ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
యుద్ధాలు, అంతర్గత సంఘర్షణలు ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతున్నాయన్నారు. విద్యా కమిషన్ సభ్యుడు అకునూరి మురళి మాట్లాడుతూ నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ అందరికీ అందనంత కాలం అసమానతలు తొలగవని అన్నారు. సెస్ డైరెక్టర్ రేవతి మాట్లాడుతూ దేశంలో ఇప్పటికీ సామాజిక, ఆర్థిక అసమానతలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు.
