పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు..LRS పై వీడని సస్పెన్స్

పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు..LRS పై వీడని సస్పెన్స్
  • నాన్ అగిరకలచ్ర్ రిజిస్ట్రేషన్లకు వర్తింపు
  • ముందస్తు స్లాట్ బుకింగ్స్  నిలిపివేత
  • నేరుగా ‘కార్డ్’ సిస్టం ద్వారా రిజిస్ట్రేషన్లు
  • 105 రోజుల తర్వాత మళ్లీ మొదలు
  • ఆధార్ , ఫ్యామిలీ మెంబర్ల వివరాలు అవసరం లేదు
  • ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల విషయంలో మాత్రం ఇంకా గందరగోళం 

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో నాన్  అగ్రికల్చర్  రిజిస్ట్రేషన్లు పాత పద్ధతి ప్రకారమే జరుగనున్నాయి. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడం, హైకోర్టు కూడా అభ్యంతరం చెప్పడంతో కొత్త విధానంపై సర్కారు వెనక్కితగ్గింది. కొత్తగా చేపట్టిన స్లాట్ల బుకింగ్​ను నిలిపివేసింది. సోమవారం నుంచి తిరిగి పాత ‘కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్‌‌‌‌)’ విధానంతో రిజిస్ట్రేషన్లు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీనిపై సీఎం కేసీఆర్​ సూచనల మేరకు.. సీఎస్​ సోమేశ్​కుమార్​ శనివారం సర్క్యులర్​ జారీ చేశారు. రాష్ట్రంలోని 141 ఆఫీసుల్లోని సబ్ రిజిస్ట్రార్లు, స్టాఫ్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది, అంతరాయం కలగకుండా వేగంగా రిజిస్ట్రేషన్లు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుని ఉన్నవారికి యథావిధిగా రిజిస్ట్రేషన్​ చేస్తామని తెలిపారు.

మూడు నెలల తర్వాత

కొత్తగా ‘ధరణి’ పోర్టల్ ను అమల్లోకి తెస్తున్నామంటూ మూడు నెలల కింద రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్లను సర్కారు నిలిపివేసింది. వ్యవసాయ భూములను ‘ధరణి’ ద్వారా చేపట్టినా.. నాన్​ అగ్రికల్చర్​ ఆస్తుల విషయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. నాన్​ అగ్రికల్చర్​ ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ముందుగా స్లాట్​ బుక్​ చేసుకోవాలనడం, దానికి పర్సనల్​ డేటా తీసుకోవడం.. ఎల్ఆర్ఎస్, ప్రాపర్టీ ట్యాక్స్​ నంబర్, ఆధార్, ఫ్యామిలీ మెంబర్ల వివరాలను  లింకు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తమైంది. దానితోపాటు కొత్త రిజిస్ట్రేషన్లలో స్టాంపు పేపర్లు, స్కెచ్​మ్యాప్​ వంటి కీలక వివరాలు లేకపోవడంపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. దీంతో జనం, బిల్డర్లు ఆందోళనలకు దిగారు. ప్రతిపక్షాలు కూడా మండిపడ్డాయి. ఇదే సమయంలో కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. కోర్టు సర్కారు తీరును తప్పుపట్టింది. పర్సనల్​ డేటా తీసుకోకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని చెప్పింది.

దీంతో సర్కారు ఈ నెల 14 నుంచి రిజిస్ట్రేషన్లను మొదలుపెట్టింది. పేరుకు పాత పద్ధతే అని చెప్పినా.. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టింది. ఆధార్  నంబర్  స్వచ్చందం అంటూనే.. ఆధార్ నంబర్ తీసుకుంది. అంతేకాదు కులం, ఫ్యామిలీ, ఇతర పర్సనల్​ వివరాలు అడగబోమని చెప్పిన సర్కారు.. ఆ వివరాలు ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్ చేయలేదు. సాఫ్ట్​వేర్ ను కూడా సవరించలేదు. పీటీఐఎన్ నంబర్ లేకపోతే రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ తప్పులన్నింటినీ గుర్తించిన హైకోర్టు.. సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫ్ట్​వేర్ లో మార్పులు చేసి, పర్సనల్​ వివరాలు అడకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని, అప్పటిదాకా స్లాట్ బుకింగ్ ను నిలిపేయాలని స్పష్టం చేసింది. దీంతో దిగొచ్చిన రాష్ట్ర సర్కారు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లకు మొగ్గు చూపింది.

స్లాట్ల బుకింగ్.. ఆగిపోయింది

రాష్ట్రంలో ఈ నెల 11 నుంచే రిజిస్ట్రేషన్లు తిరిగి మొదలైనా.. జనం నుంచి పెద్దగా రెస్పాన్స్​ రాలేదు. 141 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉండగా.. ఒక్కో ఆఫీసులో 24 స్లాట్ల చొప్పున రోజుకు మొత్తంగా 3,384 స్లాట్స్ బుకింగ్ కు అవకాశం ఇచ్చారు. కానీ ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్​వేర్​పై అనుమానాలు వ్యక్తం కావడం, ఏవేవో రూల్స్​ పెట్టడం, ఆధార్​ సహా వ్యక్తిగత వివరాలన్నీ అడగడం వంటివాటితో ప్రజలు రిజిస్ట్రేషన్లకు ముందుకు రాలేదు. రిజిస్ట్రేషన్  తర్వాత జారీచేసే డాక్యుమెంట్లపై లోన్ ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరించారు. పాత పద్ధతిలోనే డాక్యుమెంట్ కావాలని స్పష్టం చేశారు. ఇది కూడా జనంలో గందరగోళం రేపింది. మొత్తంగా ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసుల పరిధిలో కలిపి కూడా 2,599 స్లాట్లు మాత్రమే బుక్కయ్యాయి. ఇందులో 1,760 రిజిస్ట్రేషన్లే పూర్తయ్యాయి. కాగా.. స్లాట్ బుక్​చేసుకుని, రిజిస్ట్రేషన్ కాని మిగతా 839 ఆస్తుల రిజిస్ట్రేషన్లను స్లాట్​ టైం ప్రకారమే చేసుకోవచ్చని సర్కారు సూచించింది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు, అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకే.. ముందస్తు స్లాట్ బుకింగ్  నుంచి మినహాయింపు ఇచ్చినట్టు సీఎస్​ సోమేశ్​కుమార్​ ప్రకటించారు. స్లాట్ బుక్​చేసుకున్నా, చేసుకోకపోయినా రిజిస్ట్రేషన్లు చేయాలని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించారు.

ఎల్ఆర్ఎస్​ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్​పై వీడని సస్పెన్స్

పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తామన్న రాష్ట్ర సర్కారు.. ఎల్ఆర్ఎస్​ కాని ఓపెన్​ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తరా, లేదా? అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. వారం రోజులు రిజిస్ట్రేషన్​ శాఖ పోర్టల్ ద్వారా అమలు చేసిన కొత్త విధానంలో… ఎల్ఆర్ఎస్ అప్లికేషన్​ నంబర్​ ద్వారా ఓపెన్​ ప్లాట్ల స్లాట్ బుకింగ్ కు చాన్స్​ ఇచ్చింది. కానీ టెక్నికల్ సమస్యల వల్ల వాటికి స్లాట్ బుక్ కాలేదు. కొత్త సిస్టంలో ఈ ఆప్షన్​ ఇచ్చినందున.. ఎల్ఆర్ఎస్ కాని ఓపెన్​ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు సర్కారు సుముఖంగానే ఉన్నట్టుగా రియల్టర్లు, ప్లాట్ల ఓనర్లు భావించారు. కానీ శనివారం సీఎస్​ సోమేశ్​కుమార్​ విడుదల చేసిన ప్రకటనలో ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడంతో టెన్షన్​ నెలకొంది. ఎల్ఆర్ఎస్​ కోసం అప్లై చేసుకున్నవారిలో కొందరు అనారోగ్య సమస్యలు, అప్పులు, పిల్లల పెళ్లిళ్లు తదితర అత్యవసర ఖర్చుల కోసం ప్లాట్లు అమ్ముకునేందుకు రెడీ అయ్యారు. ఎల్ఆర్ఎస్​ లేనివాటి రిజిస్ట్రేషన్లపై సర్కారు స్పష్టత ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్​ అప్లికేషన్​ ఆధారంగా రిజిస్ట్రేషన్​కు అవకాశమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

సీఎం రాలే.. రివ్యూ జరగలే..

సీఎం కేసీఆర్​ శనివారం రిజిస్ట్రేషన్లపై ఉన్నత స్థాయి రివ్యూకు సిద్ధమయ్యారు. దీనిపై సీఎంవో నుంచి ఓ నోట్ కూడా విడుదలైంది. ‘‘హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లడమా, లేక తగిన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్లు కొనసాగించడమా?’’ అని అందులో పేర్కొన్నారు. కానీ హైకోర్టు కాపీ చేతికి అందాక కేసీఆర్ ఫాంహౌజ్ నుంచే ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడారని.. కోర్టు సూచనల మేరకు రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఆదేశించారని తెలిసింది.

నష్టాలు, కష్టాలకు బాధ్యులెవరు?

రాష్ట్రంలో సోమవారం నాటికి (డిసెంబర్ 21) రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి 105 రోజులు పూర్తవుతోంది. ఇన్ని రోజులుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయి.. జనం పడ్డ కష్టనష్టాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అనాలోచితంగా రిజిస్ట్రేషన్లు బంద్ చేయడం వల్ల జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుతారో సర్కారు సమాధానం చెప్పాలన్న డిమాండ్  వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 7న సర్కారు గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లను బంద్  పెట్టింది. నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగక లక్షల మంది జనం ఇబ్బందిపడ్డారు. అత్యవసరాల కోసం కూడా ఆస్తి అమ్ముకోలేక బాధపడ్డారు. కొనుగోళ్లు ఆగిపోయి, నిర్మాణాలు నిలిచిపోయి.. రియల్ ఎస్టేట్, కన్ స్ట్రక్షన్, బ్యాంకింగ్, ఇతర రంగాలు నష్టపోయాయి. దాంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.30 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.

ఆందోళనలో 25.59 లక్షల ప్లాట్ల ఓనర్లు

ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి అక్టోబర్​ 31 వరకు ఎల్ఆర్ఎస్​ అప్లికేషన్లు స్వీకరించారు. అనధికార లేఔట్లలో ఉన్న ఖాళీ ప్లాట్ల రెగ్యులరైజేషన్​ కోసం అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి.. 25 లక్షల 59 వేల 562 అప్లికేషన్లు వచ్చాయి. ఎల్ఆర్​ఎస్​పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ​వారంతా ఇప్పుడు ఆందోళనలో పడ్డారు.