మెదక్, కొల్చారం, వెలుగు: సింగూర్ ప్రాజెక్ట్ నీటి విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎట్టకేలకు మంజీరా బ్యారేజ్ నుంచి నీరు విడుదల కాగా, మంగళవారం రాత్రి వరకు ఘనపూర్ ఆనకట్టకు చేరనున్నాయి. దీంతో వేలాది మంది ఆయకట్టు రైతులకు ఊరట లభించింది. మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనకట్ట కింద, మంజీరా నది పరివాహక ప్రాంతంలో యాసంగి సీజన్‌లో సుమారు 20 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. అయితే ఆనకట్టలో నీరు అడుగంటడం, బోర్లలో నీటిమట్టాలు తగ్గిపోవడంతో చాలాచోట్ల నీటి తడులు అందక పంటలు ఎండిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల నాయకులు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌ను కలిసి పంటలను కాపాడేందుకు సింగూర్ నుంచి 0.3 టీఎంసీ నీటిని విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఇరిగేషన్ అధికారులు గత శనివారం సంగారెడ్డి జిల్లా పరిధిలోని సింగూర్ ప్రాజెక్ట్ గేట్ ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే సింగూర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న మంజీరా బ్యారేజీ వద్ద హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు నీటిని ఆపేయడంతో నీరు దిగువకు రాలేదు.
దీంతో నీరు రాకుంటే పంటలు ఎండిపోతాయని ఘనపూర్ ఆయకట్టు రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఘనపూర్ ఆయకట్టు రైతుల అవసరాల కోసం సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసినప్పటికి మంజీరా బ్యారేజీ వద్ద ఆపేయడంతో నీరు ఘనపూర్ ఆనకట్టకు చేరడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో ఇరిగేషన్ సంగారెడ్డి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) సూచన మేరకు మంజీరా బ్యారేజీ నుంచి 0.3 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తూ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు జీఎం రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం రాత్రి మంజీరా బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేయగా ఆ నీరు మంగళవారం రాత్రి వరకు ఘనపూర్ ఆనకట్టకు చేరే అవకాశం ఉంది.
.నీరు ఇక్కడికి చేరాక గేట్లు ఎత్తి మహబూబ్ నహర్, ఫతేనహర్ కాల్వలకు విడుదల చేస్తారు. సింగూర్ నీటి రాకతో ఘనపూర్ ఆయకట్టు రైతులతోపాటు, చిలప్ చెడ్, కొల్చారం, పాపన్నపేట మండలాల పరిధిలో మంజీరా పరివాహక ప్రాంతంలో పంటలు సాగు చేసిన రైతులకు మేలు కలుగనుంది.

