ముంబై: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా కుదేలైన స్టాక్ మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల బాటలోనే దేశీయ స్టాక్ మార్కెట్లూ భారీ లాభాలను సాధించాయి. వరుసగా నాలుగు రోజుల నష్టాల తర్వాత బీఎస్‌ఈ సెన్సెక్స్ 899.71 పాయింట్లు (1.14శాతం) లాభపడి 80,015.90 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1,187.64 పాయింట్లు ఎగబాకి 80,303.83 స్థాయికి చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం నష్టాల నుంచి బయటపడి 285.40 పాయింట్లు (1.17 శాతం) ఎగిసి 24,765.90 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ లో అదానీ పోర్ట్స్, లార్సెన్ అండ్ టూబ్రో, ఎన్టీపీసీ, రిలయన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్లు దూసుకెళ్లాయి. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనీలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే సర్వీసెస్ షేర్లు 2.84 శాతం మేర పెరిగాయి. యుటిలిటీస్ 2.58 శాతం, పవర్ 2.41 శాతం, మెటల్ 2.32 శాతం, ఇండస్ట్రియల్స్ 2.32 శాతం, ఆటో 1.95 శాతం, రియల్టీ 1.91 శాతం, ఎనర్జీ 1.83 శాతం మేర పుంజుకున్నాయి. ఐటీ రంగం మాత్రమే స్వల్ప నష్టాలను చవిచూసింది. బీఎస్ఈలో మొత్తం 2,803 కంపెనీల షేర్లు లాభాల్లో ముగియగా, 1,453 షేర్లు నష్టపోయాయి. 141 కంపెనీల షేర్ల ధరలు మారలేదు.
మరింత పెరిగిన క్రూడ్ ధర
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.84 శాతం పెరిగి బ్యారెల్ కు 82.90 డాలర్లకు చేరింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి దీని ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. హోర్మూజ్ జలసంధి నుంచి సరఫరా నిలిచిపోవడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే, గురువారం ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఎఫ్ఐఐలు బుధవారం రూ.8,752.65 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మగా, గురువారం మరో రూ.3,750 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇన్వెస్టర్ల ఆందోళనను సూచించే వీఐఎక్స్ 15 శాతం పడింది.
41 పైసలు పెరిగిన రూపాయి
స్టాక్ మార్కెట్ల సానుకూల ప్రభావంతో రూపాయి తన ఆల్ టైమ్ కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే దీని విలువ గురువారం 41 పైసలు పెరిగి 91.61 వద్ద ముగిసింది. ఆర్బీఐ జోక్యం చేసుకోవడం రూపాయి పుంజుకోవడానికి ప్రధాన కారణమని ఫారెక్స్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి 92.16 వద్ద ప్రారంభమై 91.30 గరిష్ట స్థాయిని తాకింది. బుధవారం రూపాయి 56 పైసలు పతనమై 92.05 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. హోలీ కారణంగా మంగళవారం మార్కెట్లు ఓపెన్ కాలేదు.
