V6 News

నీతికథ:  సరైన గుమాస్తా ఎంపిక..  ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి

నీతికథ:  సరైన గుమాస్తా ఎంపిక..  ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి

ధర్మయ్య జమిందార్ రఘువర్మ దివానంలో గుమస్తాగా పనిచేసేవాడు. అతడు  వృద్ధుడు కావడంతో అతని స్థానంలో మరొకరిని గుమస్తాగా నియమించమని జమిందార్ ఆ బాధ్యతను ధర్మయ్యకే అప్పగించాడు. దివానం​లో గుమస్తా ఉద్యోగం కోసం శివరాజు, సుబ్బరాజు అనే యువకులు ధర్మయ్యను కలిశారు. ధర్మయ్య శివరాజుతో ‘‘నేను వారం రోజులు పక్క గ్రామానికి వెళ్తున్నాను. కాబట్టి ఈ వారం రోజులు దివానం​లో జరిగే ఆర్థిక లావాదేవీలను నువ్వు నమోదు చేయాలి”అంటూ అతనికి బాధ్యత అప్పగించి వారం రోజుల తర్వాత వచ్చాడు. 

శివరాజు ఆ వారం రోజులపాటు తాను నిర్వహించిన వివరాల పుస్తకాన్ని ధర్మయ్యకు అందించాడు. ధర్మయ్య అతనితో ‘‘నేను నీకు మరలా కబురు పెడతాను అప్పుడు రా” అని చెప్పి పంపించాడు. తర్వాత సుబ్బరాజుకు కబురు పంపి అతనితో కూడా ‘‘నేను వారం రోజుల పాటు దివానం​లో ఉండను. వారం పాటు దివానం​లో జరిగే వ్యవహారాలకు జమా ఖర్చులను నమోదు చేసి నేను వచ్చిన తర్వాత ఇవ్వు” అని చెప్పాడు. వారం రోజుల తర్వాత సుబ్బరాజు అందించిన జమా ఖర్చుల పుస్తకాన్ని తీసుకొని అతనిని పంపించాడు. 
తర్వాత జమీందారును కలిసి ‘‘అయ్యా! దివానం​లో గుమస్తా ఎంపిక కోసం శివరాజు, సుబ్బరాజు అనే యువకులకు ఒక్కో వారం గుమస్తా బాధ్యత అప్పగించి జమా ఖర్చులు రాయమన్నాను. వారు రాసిన జమా ఖర్చులు వివరాలు మీకు అందజేస్తున్నా. వారిద్దరూ రేపు మీ దగ్గరికి వస్తారు. వారు రాసిన జమా ఖర్చుల వివరాలు పరిశీలించి వారిలో ఒకరిని ఎంపిక చేసి ఉద్యోగం ఇవ్వండి” అని చెప్పి ఆ పుస్తకాలు అప్పజెప్పి వెళ్లిపోయాడు. 

జమిందారు ఇద్దరు రాసిన జమా ఖర్చులు వివరాలు పరిశీలించాడు. తర్వాత రోజు శివరాజు, సుబ్బరాజు తన దగ్గరకు వస్తే వారితో ‘‘ఈ ఉద్యోగానికి సుబ్బరాజును నేను ఎంపిక చేస్తున్నా. ఎందుకంటే శివరాజు రాసిన జమా ఖర్చులలో ఇక్కడ పనిచేసే కూలీలు వారు రోజు తీసుకునే కూలీ మొత్తం కన్నా కొంత అదనపు మొత్తాన్ని తీసుకున్నట్టు గుర్తించాను. దీనికి కారణం శివరాజు ప్రతిరోజు కూలీలకు ఇచ్చే సొమ్ము గురించి వాకబు చేయకుండా వారు అడిగినంత ఇచ్చాడు. అంటే ఒక బాధ్యత నెరవేర్చేటప్పుడు ఉదాసీనత ఉండకూడదు. అన్ని వివరాలు తెలుసుకుని ముందడుగు వేయాలి. 

కానీ, సుబ్బరాజు కూలీలు అంతకుముందు ఎంత కూలీ తీసుకునేవారో తెలుసుకుని అంతే ఇచ్చినట్లు గమనించాను. సుబ్బరాజు ఏమరపాటు లేకుండా ఇచ్చిన బాధ్యతను యజమానికి నష్టం కలగకుండా నిర్వహించాడు. గుమస్తాకు ఉండవలసిన లక్షణం అది. కాబట్టి సుబ్బరాజును దివానం​లో గుమస్తాగా నియమిస్తున్నాన’’ని చెప్పి సుబ్బరాజుకు నియామక పత్రం ఇచ్చాడు.

‌‌‌‌ - మొర్రి గోపి -

మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి.