ఫారిన్​ టూర్​ నుంచి రాగానే కేటీఆర్​కు ​బాధ్యతలు

ఫారిన్​ టూర్​ నుంచి రాగానే కేటీఆర్​కు ​బాధ్యతలు

మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష
టికెట్​ఎవరికివ్వాలన్నదానిపై పూర్తయిన సర్వే
బీజేపీ ప్రభావిత ప్రాంతాలపై స్పెషల్​ నజర్​
ప్రచారానికి సీఎం కేసీఆర్​ దూరం

హైదరాబాద్, వెలుగు : ఫ్యామిలీతో కలిసి ఫారిన్​టూర్​లో ఉన్న టీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 27న హైదరాబాద్ కు రాబోతున్నారు. వచ్చీరాగానే మున్సిపోల్స్ పై దృష్టి పెడతారని, క్యాండిడేట్స్​ఎంపిక, ప్రచారంతో పాటు అన్ని బాధ్యతలు కేటీఆర్​కే  సీఎం అప్పగించారని సమాచారం. నిజామాబాద్, కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఆయన ప్రచారం చేస్తారని సమాచారం. బీజేపీ ప్రభావిత మున్సిపాల్టీలపై ప్రత్యేక దృష్టి పెడుతారని తెలిసింది. మున్సిపోల్స్ ప్రచారానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఏ మున్సిపాల్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఇప్పటికే సర్వే పూర్తిచేశారని ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్యే చెప్పారు. గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారని, స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. అయితే గెలిపించుకునే బాధ్యత కూడా వారిదేనని, మంత్రులు జిల్లాలో ఉన్న మున్సిపోల్స్ కు బాధ్యులుగా ఉంటారని చెప్పారు.

ఈ నెల 27న కేటీఆర్ సమీక్ష?

ఈ నెల 27న కేటీఆర్ విదేశీ పర్యటన నుంచి రాగానే అదే రోజు మున్సిపోల్స్ పై రివ్యూ పెడతారు. ఎమ్మెల్యేలు,మంత్రులను ఆ సమావేశానికి పిలిచే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కాంగ్రెస్, బీజేపీలను ఎలా ఎదుర్కోవాలో ఆ సమావేశంలో కేటీఆర్ వివరిస్తారని తెలిసింది.