సైబర్ కేటుగాళ్ల వేధింపులు మితిమీరిపోతున్నాయి. డబ్బుతో పాటు ప్రాణాలు తీస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వేధింపులకు హైదరాబాద్ లో 76 ఏళ్ల రిటైర్డ్ మహిళా అధికారిణి బలవడం కలకలం రేపుతోంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో వేధించడంతో బాధితురాలు గుండె పోటుతో చనిపోయింది. చనిపోయినా తరువాత కూడా సైబర్ నేరగాళ్ల మెసేజ్ లు ఆగడం లేదు. బాధితురాలి కొడుకు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవహారంలో కేసు నమోదు అయ్యిందని వేధించారు. బెంగుళూరు పోలీస్ లోగో తో వరుసగా బాధితురాలికి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫేక్ ఐడి, ఫేక్ కోర్ట్ స్టాంప్ లతో ఉన్న డాక్యుమెంట్లు చూపించి వేధించారు. అప్పటికే 6.6 లక్షలు పెన్షన్ డబ్బులను పంపింది బాధితురాలు. అయినా కూడా ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో మనస్థాపానికి గురైన బాధితురాలు గుండెపోటుతో చనిపోయింది. మహిళ చనిపోయిన తర్వాత కూడా మెసేజ్ లు రావడంతో బాధితురాలి కొడుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సైబర్ సెక్షన్ లతో పాటు, నేరపూరిత హత్య కింద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్ లైన్ ట్రేడింగ్ తో మోసం
రెండు రోజుల క్రితం ఆన్‌లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌లో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.6.75 కోట్లు దోచుకున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా బాధితులను ఆకర్షించి, ఫేక్ వెబ్‌సైట్ లింకులతో ట్రేడింగ్ చేయించారు. భారీ లాభాలు వస్తాయని నమ్మించి కోట్లు కొట్టేశారు. బాధితులు సైబర్ సెక్యూరిటీ బ్యూరో కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు
