- శంషాబాద్ ఎయిర్ పోర్టును ఆనుకొని జాగా
- ఒకే వ్యక్తికి చెందిన 28 కంపెనీల పేర రిజిస్టర్
- ఇందులో భూదాన్, అసైన్డ్ భూములు
- కేసీఆర్ బినామీయే ఈ మైహోం: సీఎం
హైదరాబాద్, వెలుగు: ‘మాజీ సీఎం కేసీఆర్ హోమే మై హోమ్.. ఈయన కేసీఆర్ బినామే అని రాష్ట్రంలో అందరికీ తెలిసిందే’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ను ఆనుకొని ‘మై హోం’ కు 2,463 ఎకరాల భూమి ఉందన్నారు. ఒకే వ్యక్తికి చెందిన 28 కంపెనీల పేర్లపై ఇవి రిజిస్టరై ఉన్నట్లుగా తెలిపారు. ఇందులో ప్రభుత్వ నిషేధిత జాబితాలోని, భూదాన్, అసైన్డ్ భూములు కూడా ఉన్నాయన్నారు. రూ.వేల కోట్ల విలువ చేసే జాగాలను ఈ కంపెనీలకు అప్పగించడం వెనుక మాజీ సీఎం కేసీఆర్ కుట్ర దాగి ఉందని సీఎం ఆరోపించారు. ముచ్చింతల, పాలమాకుల , మదనపల్లి, పెద్దతూప్ర, సాగిడి, గొల్లూరు, నందనపల్లి, తూప్ర, నాగారం, వెంకన్నగూడ తదితర గ్రామాల్లో మొత్తం 2,463 ఎకరాల భూములను ‘మై హోం’ కంపెనీలకు ధారాదత్తం చేసినట్లుగా సీఎం వెల్లడించారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ప్రభుత్వ భూమి ఎంత ఉందో .. అంతే స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు భూములు ఉన్నాయన్నారు. గొల్లూరు గ్రామంలో నిషేధిత జాబితాలో 301.07 ఎకరాల భూమిని, నాగారంలో సర్వే నెంబర్ 195 లో 315 ఎకరాలు నిషేధిత జాబితాలోని భూములను 2014 తర్వాత కేసీఆర్ సర్కారు రికార్డులను మార్చి డీ నోటిఫై చేసి కేసీఆర్ బినామీ ‘ మై హోం’ కంపెనీకి అప్పగించారన్నారు. కాప్రాలోని మేళ్ల చెరువు మై హోం సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర 242 ఎకరాల భూములు ఉండగా ఇందులో 113 ఎకరాల ప్రభుత్వ భూదాన్ భూములని ప్రాథమికంగా లెక్క తేలిందన్నారు.
ఈ భూములన్నీ మై హోం కంపెనీకి ఎట్లా వచ్చాయని సీఎం ప్రశ్నించారు. ‘ఇన్నేళ్లు ఎవరి సొమ్ము ఎవరు తిన్నారు.. సామాన్యులు కోట్లకు అధిపతులుగా ఎలా మారారు? వాళ్లు తప్పులు చేసి మాపై బురద జల్లడం ఏంటి? ’ అని సీఎం మండి పడ్డారు. గద్దల్లా వాలి ప్రభుత్వ, పేదల ఆస్తులు కాజేసి ఆగర్భ శ్రీమంతులు అయ్యారని ధ్వజమెత్తారు. ‘ఆంధ్రా వాళ్లు ఈ భూములను కాజేస్తున్నారని కేసీఆర్ ఓ పత్రికలో పెద్ద, పెద్ద అక్షరాలతో వార్తలు రాయించారని, ఆ పత్రికలో వచ్చిన సర్వే నెంబర్లు ప్రభుత్వ భూములకు సంబంధించినవేనని చెప్పారు. ఆ తర్వాత ఆంధ్రా వాళ్లను బెదిరించి అవే భూములను ‘మై హోం’ కు అప్పగించారని అని సీఎం వెల్లడించారు.
