
ఫాం హౌస్ కేసు విచారణ సరైన పద్దతిలో జరగడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కేసులో బీఆర్ఎస్, బీజేపీలు పార్టీలు రెండు బాధితులే అయినప్పుడు దోషి ఎవరని ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఫాం హౌస్ కేసుపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. నేరం జరిగిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తామే విచారణ జరుపుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు నేరమే జరగలేదంటున్న బీజేపీ సీబీఐ విచారణ కోరడాన్ని రేవంత్ తప్పుబట్టారు. సిట్ విచారణకు బీజేపీ, సీబీఐ విచారణకు బీఆర్ఎస్ ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు. పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫాం హౌస్ కేసులో కాంగ్రెస్ ఇంప్లీడ్ పిటిషన్ వేయాలా వద్దా అన్న అంశంపై చర్చ జరుగుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వారేనని అన్నారు. పార్టీ మారిన వారికి బీఆర్ఎస్ లో మంచి పదవులు ఇచ్చారని.. అది కూడా అవినీతి కిందకే వస్తుందని అన్నారు. 2018 నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలోనే సీబీఐకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరుపై స్పందించేందుకు రేవంత్ నిరాకరించారు. పార్టీ అంతర్గత విషయాలు బయటికి చెప్పలేనని అన్నారు. పార్టీలో వర్గాలు లేవన్న ఆయన.. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. హైకమాండ్ సూచనల మేరకే పాదయాత్ర ఉంటదని, కాంగ్రెస్ చేపట్టిన హత్ సే హత్ జోడో యాత్ర ప్రజా సమస్యలపై పోరాటం కోసమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.